
మంగళూరులో మాట్లాడుతున్న రాహుల్
మంగళూరు: కర్ణాటకలో రాబోయే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను సృష్టిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. వ్యవసాయ రంగంపై రూ.1.25 లక్షల కోట్లను వెచ్చిస్తామని హామీ ఇచ్చారు. మంగళూరులో శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. ‘2025 నాటికి నవకర్ణాటక నిర్మాణ సంకల్పం’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధాని తన మనసులో మాట(మన్‌కీ బాత్)ను ప్రజలు వినాలని కోరుకుంటారనీ, తాము మాత్రం కర్ణాటక ప్రజల మనసులోని మాటను మేనిఫెస్టోలో చేర్చామని పేర్కొన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. పర్యటనలో భాగంగా ధర్మస్థలలో మంజునాథేశ్వరున్ని రాహుల్ దర్శించుకున్నారు.
భారీస్థాయిలో వ్యవసాయ కారిడార్
కర్ణాటకలో రూ.1.25 లక్షల కోట్లతో 10 ఆగ్రో–జోన్లతో వ్యవసాయ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ తెలిపింది. దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత పెంపు, ధరల స్థిరీకరణ, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేయడం వీలవుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం, పోలీస్ విభాగంలో 33 శాతం మహిళా ఉద్యోగులు భర్తీ అయ్యేలా చర్యలు తీసుకుంటామంది. వివిధ ప్రాజెక్టులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీచేస్తామని తెలిపింది. కావేరీ బేసిన్‌లో అదనంగా ఉన్న 80 టీఎంసీల నీటిని వాడుకోవడం ద్వారా రాష్ట్రంలో ఆహార భద్రతను సాధిస్తా మని వెల్లడించింది. రాష్ట్రంలో ఐటీ సెక్టార్‌ను మరింతగా అభివృద్ధి చేస్తామనీ, స్టార్టప్‌లకు సబ్సిడీలు అందజేస్తామని పేర్కొంది. స్కూళ్లతో పాటు ప్రభుత్వ సాయం పొందే కోచింగ్ సెంటర్లలో నాణ్యత పెంచుతామంది.
రాహుల్ విమాన ఘటనపై దర్యాప్తు
బెంగళూరు: రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఘటనపై దర్యాప్తు కోసం డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఇద్దరు నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఘటనపై కర్ణాటక పోలీసులూ దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటకలోని హుబ్బలి ఎయిర్‌పోర్ట్‌లో గురువారం రాహుల్ విమానం ల్యాండింగ్‌కు ముందు అనుమానాస్పద ఘటనలు జరిగాయని కాంగ్రెస్ నేత ఒకరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ సమయంలో విమానం ఒక్కసారిగా ఎడమ వైపునకు ఒరిగిపోయిందని, వాతావరణం బాగానే ఉన్నా.. అనుమానాస్పదంగా ల్యాండ్ అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.