
సాక్షి,ఢిల్లీ: నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం(జూన్28) వాయిదా పడ్డాయి. అంతకుముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై మాట్లాడుతుండగానే ఆయన మైక్ కట్ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. మైక్రోఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతించాలని స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ విజ్ఞప్తి చేయడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. నీట్‌పై ప్రధాని మోదీ ఏం స్పందించడం లేదని, సభలో యువత తరఫున రాహుల్ తన గొంతు వినిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
ఇలాంటి సీరియస్ అంశంలో కూడా మైక్ కట్‌చేసి యువత గొంతు నొక్కుతున్నారని ట్వీట్‌లో కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ చేసిన మైక్‌కట్ ఆరోపణలపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. తాను ఎంపీల మైక్రోఫోన్ స్విచ్చాఫ్ చేయనని, అలాంటి నియంత్రణ ఏదీ తన వద్ద లేదని స్పీకర్ స్పష్టంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సమయంలో ఇతర విషయాలేవీ రికార్డు కావని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment