సీడబ్ల్యూసీ భేటీలో సోనియా, రాహుల్ మాటామంతీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అధికార బీజేపీకి అబద్ధాలే పునాదులని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ విరుచుకుపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో..లక్షలాది కోట్ల రూపాయల 2జీ స్కాం అంటూ మోదీ,æజైట్లీ తప్పుడు సమాచారంతో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేశారన్నారు. ఒక అబద్ధాన్ని కల్పించటం, దానిని ప్రచారం చేయటం, ప్రజలు నమ్మేదాకా పదేపదే అదే అబద్ధాన్ని చెప్పటం..ఇదే బీజేపీ కుట్ర అని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశాజనకమైన ఫలితాలను సాధించటం, యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన భారీ కుంభకోణం 2జీ కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన మర్నాడే ఈ సమావేశం జరగటం గమనార్హం.
ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సన్నద్ధతపైనా చర్చించారు. పార్టీలో క్రమశిక్షణ అంశం, నిర్మాణాత్మకంగా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిన పార్టీ నేతల వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా పార్టీకి మార్గదర్శకత్వం వహించి, ఎనలేని సేవలు అందించిన మాజీ అధినేత్రి సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ సీడబ్ల్యూసీ ఒక తీర్మానంచేసింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇకపై రాహుల్ సీడబ్ల్యూసీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఆజాద్, తదితరులతోపాటు రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment