డూంగర్‌పూర్ సభలో రాహుల్
డూంగర్‌పూర్: ప్రధానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దేశమంతటా వీధుల్లో ఒకే మాట వినిపిస్తోందనీ, దేశ కాపలాదారుడు (మోదీ) దొంగగా మారాడని వారంటున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి ప్రధానిలా కాకుండా కాపలదారుడిలా తాను పనిచేస్తానని గతంలో పలుమార్లు మోదీ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో రాహుల్ గురువారం పర్యటించారు.
డూంగర్‌పూర్ జిల్లాలో ఓ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో మోదీ మౌనంగా ఉన్నారనీ, బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యాను వెనక్కు రప్పించడంలోనూ విఫలమయ్యారని అన్నారు. ఈ అంశాలపై తాను పార్లమెంటులో ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదనీ, ఈ కారణాల వల్లే ప్రధానిని అంతా దొంగ అంటున్నారని పేర్కొన్నారు. 15 మంది పారిశ్రామిక వేత్తలు తీసుకున్న 2.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం.. అప్పుల్లో కూరుకుపోయిన రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఒప్పుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించి, కష్టపడి పనిచేస్తున్న నాయకులకే ఈసారి టికెట్లు ఇస్తామన్నారు.
హాస్య యువరాజు రాహుల్: జైట్లీ, స్మృతి
మోదీని రాహుల్ దొంగ అనడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయనకు ప్రధాని పదవి అంటే గౌరవం లేకుండా పోయిందని వారు విమర్శించారు. రాహుల్ హాస్య యువరాజుగా మారారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. రాహుల్‌పై ఎదురుదాడి చేస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. రాహులే అన్ని విషయాల్లోనూ తన ప్రభుత్వం గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జైట్లీ ఆరోపించారు. జైట్లీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా స్పందించింది. జైట్లీ విదూషకుడిలా వ్యవహరిస్తున్నారంది.
Comments
Please login to add a commentAdd a comment