Raphal fighter jets
-
రఫేల్‌కు తోడుగా హ్యామర్
న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఆర్మీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు వస్తున్న సమయంలోనే వాటి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి హ్యామర్ క్షిపణుల్ని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలుకు సంబంధించిన అధికారాలను అత్యవసర పరిస్థితుల కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ సాయుధ బలగాలకు కట్టబెట్టింది. ఈ క్షిపణులు గగనతలం నుంచి ఉపరితలానికి 60–70 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలవు. తూర్పు లద్దాఖ్ పర్వత శ్రేణుల నుంచి సరిహద్దుల్లో బంకర్లు, ఇతర శిబిరాలపై దాడులు చేసే అవకాశం హ్యామర్ క్షిపణి ద్వారా వీలు కలుగుతుంది. ‘హ్యామర్ క్షిపణులు కొనుగోలుకి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. అత్యంత స్వల్ప వ్యవధిలోనే రఫేల్ యుద్ధ విమానాలతో పాటు ఈ క్షిపణుల్ని సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించింది’’అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు అత్యవసరంగా ఈ క్షిపణులు అవసరం ఉండడంతో ఇప్పటికే మరొకరికి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్న క్షిపణుల్ని ఫ్రాన్స్ అధికారులు మన దేశానికి తరలిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న ఫ్రాన్స్ నుంచి అయిదు రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. ‘ప్రశాంతతే బంధాలకు పునాది’ చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట శాంతి, సంయమనం నెలకొనడంపైననే ప్రధానంగా ఆధారపడి ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ విషయంలో చైనా నిజాయితీతో వ్యవహరిస్తుందనే ఆశిస్తున్నామని పేర్కొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపునకు సంబంధించి రెండు దేశాల మధ్య మరో విడత దౌత్య చర్చలు త్వరలో ప్రారంభమవుతాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. ఎల్ఏసీ వెంట యథాపూర్వ స్థితిలో ఎలాంటి ఏకపక్ష మార్పులను భారత్ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా జులై 5న భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి దాదాపు 2 గంటల పాటు ఫోన్లో చర్చలు జరిపిన అనంతరం జూలై 6 నుంచి గల్వాన్ లోయలోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. -
ఆ రెండింటితో వాయుసేన సుసంపన్నం
హిన్డన్/చెన్నై: అధునాతన రాఫెల్ యుద్ధవిమానాలు, క్షిపణి విధ్వంసక రష్యా ఎస్–400 వ్యవస్థలను సమకూర్చుకుంటే భారత వాయుసేన(ఐఏఎఫ్) మరింత దుర్భేద్యంగా మారుతుందని ఐఏఎఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా వ్యాఖ్యానించారు. గగనతలంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సంసిద్ధంగా ఉందన్నారు. ఐఏఎఫ్ 86వ వ్యవస్థాపక దినోత్సవం(ఎయిర్‌ఫోర్స్ డే) సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న హిన్డన్ వైమానిక స్థావరంలో నిర్వహించిన కార్యక్రమంలో ధనోవా మాట్లాడారు. -
కాపలాదారుడే దొంగయ్యాడు
డూంగర్పూర్: ప్రధానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దేశమంతటా వీధుల్లో ఒకే మాట వినిపిస్తోందనీ, దేశ కాపలాదారుడు (మోదీ) దొంగగా మారాడని వారంటున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి ప్రధానిలా కాకుండా కాపలదారుడిలా తాను పనిచేస్తానని గతంలో పలుమార్లు మోదీ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో రాహుల్ గురువారం పర్యటించారు. డూంగర్పూర్ జిల్లాలో ఓ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో మోదీ మౌనంగా ఉన్నారనీ, బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యాను వెనక్కు రప్పించడంలోనూ విఫలమయ్యారని అన్నారు. ఈ అంశాలపై తాను పార్లమెంటులో ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదనీ, ఈ కారణాల వల్లే ప్రధానిని అంతా దొంగ అంటున్నారని పేర్కొన్నారు. 15 మంది పారిశ్రామిక వేత్తలు తీసుకున్న 2.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం.. అప్పుల్లో కూరుకుపోయిన రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఒప్పుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించి, కష్టపడి పనిచేస్తున్న నాయకులకే ఈసారి టికెట్లు ఇస్తామన్నారు. హాస్య యువరాజు రాహుల్: జైట్లీ, స్మృతి మోదీని రాహుల్ దొంగ అనడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయనకు ప్రధాని పదవి అంటే గౌరవం లేకుండా పోయిందని వారు విమర్శించారు. రాహుల్ హాస్య యువరాజుగా మారారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. రాహుల్‌పై ఎదురుదాడి చేస్తూ ఫేస్బుక్లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. రాహులే అన్ని విషయాల్లోనూ తన ప్రభుత్వం గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జైట్లీ ఆరోపించారు. జైట్లీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా స్పందించింది. జైట్లీ విదూషకుడిలా వ్యవహరిస్తున్నారంది. -
రాఫెల్ డీల్ అవసరమే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ ఫైటర్ జెట్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సమర్థించారు. గతంలో కూడా ఇలా అత్యవసరంగా భారత్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిందని తెలిపారు. బుధవారమిక్కడ ధనోవా మాట్లాడుతూ.. ‘చైనా తన వాయుసేన సామ ర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. దేశ సరిహద్దులోని టిబెట్‌లో యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలను మోహరిస్తోంది. ఇండియా కూడా ఇందుకు తగ్గట్లు వాయుసేనలో ఆధునీకరణ చేపట్టాలి. పక్కనే రెండు అణ్వ స్త్ర దేశాలు (చైనా, పాక్) ఉన్నటువంటి విచిత్ర పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది. వీరి ఉద్దేశాలు రాత్రికి రాత్రి మారిపోవచ్చు. చైనా దగ్గర 1,700 ఫైటర్ జెట్లు ఉండగా, వీటిలో 800 జెట్లు నాలుగో తరానికి చెందినవే. ఒకవేళ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే వీటిలో చాలామటుకు రంగంలోకి దిగుతాయి. ప్రస్తుతం భారత్ చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని మరే దేశానికి ఈ స్థాయిలో ప్రమాదం లేదు’ అని చెప్పారు. ఒకవేళ భారత్ 42 స్క్వాడ్రన్ జెట్లను సమకూర్చుకున్నా, చైనా–పాక్‌ల సామర్థ్యంకన్నా తక్కువగానే ఉంటుందన్నారు. -
ఈ నెలంతా రాజకీయ వేడి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకోసం దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 4 రాష్ట్రాల్లో నవంబర్, డిసెంబర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు, కూటములతో సెప్టెంబర్ అంతా రాజకీయ సెగలుకక్కనుంది. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు కమ్యూనిస్టులు, ఎస్పీ, బీఎస్పీ ఇతర ప్రాంతీయ పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయత్నాలకు పదును పెట్టబోతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. సెప్టెంబర్ 9–10 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ భేటీలో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల ఎన్నికలకు సంబంధించి కీలక చర్చ జరగే వీలుంది. కత్తులు నూరుతున్న కాంగ్రెస్ రాఫెల్ ఒప్పందంపై దేశవ్యాప్తంగా 90 నగరాలు, పట్టణాల్లో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలనకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతతో ‘జన్‌ఆక్రోశ్’ ర్యాలీలు నిర్వహించనున్నారు. నిరుద్యోగం, విద్య, మహిళా భద్రత తదితర అంశాలపై బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్‌నేత ఒకరు తెలిపారు. సెప్టెంబర్ 17న రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ తర్వాతే పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 230 సీట్ల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్పీకి 25 సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో భావసారూప్యత ఉన్న పార్టీల ‘థర్డ్ ఫ్రంట్’ భేటీ సెప్టెంబర్ రెండో వారంలో జరగొచ్చని తెలుస్తోంది. -
అతిపెద్ద కుంభకోణం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక విడుదల చేసిన వేళ ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు దేశచరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. గురువారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు డబ్బులు సమకూర్చేందుకే సామాన్యులపై మోదీ నోట్ల రద్దు అస్త్రాన్ని ప్రయోగించారని విమర్శించారు. ‘పెద్ద నోట్ల రద్దు కారణంగా చెల్లకుండాపోయిన నగదంతా బ్యాంకులకు తిరిగివచ్చేసింది. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువకాదు’ అని వ్యాఖ్యానించారు. ‘దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలైన ఆయన మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నోట్ల రద్దుతో సామాన్యులపై దాడికి పాల్పడ్డారు.గత ఎన్నికల్లో ప్రచారానికి భారీగా డబ్బులు ఖర్చుపెట్టిన పారిశ్రామికవేత్తలకు సాయం చేయడమే ఆయన లక్ష్యం’ అని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ చీఫ్ అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న గుజరాత్‌లోని ఓ సహకార బ్యాంకులో ఏకంగా రూ.700 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొందరు మార్చుకోవడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో ఎవరి నగదు మార్పిడి జరిగిందో విచారణ జరిపారా? అని ప్రశ్నించారు. రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని ఆర్థికమంత్రి జైట్లీకి తాము పెట్టిన డెడ్‌లైన్ గడువు ముగుస్తోందన్నారు. రాహుల్‌తో కుమారస్వామి భేటీ కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాహుల్‌గాంధీని కర్ణాటక సీఎం కుమారస్వామి ఢిల్లీలో కలిశారు. కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై త్వరలో∙నిర్ణయం తీసుకుంటామని అనంతరం కుమారస్వామి మీడియాతో అన్నారు. -
మోదీ మిత్రుడికి 1.30 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత దేశం కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాల నిర్వహణ కోసం ప్రజలు ‘మిస్టర్ 56’ స్నేహితుడికి మరో 50 ఏళ్ల పాటు సుమారు లక్ష కోట్ల పన్నులు చెల్లించాల్సి వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ఎన్నికల్లో ఛాతీని 56 అంగుళాలకు పెంచి ఉత్సాహంగా మాట్లాడే మోదీ.. పాక్, చైనాలతో చర్చల సమయంలో ఆ ఉత్సాహం ఎందుకు చూపరని కాంగ్రెస్ విమర్శించింది. ఈ నేపథ్యంలో మోదీని రాహుల్ ‘మిస్టర్ 56’గా అభివర్ణించారు. ‘క్షమించండి.. రాఫెల్ కుంభకోణం విలువ రూ. 30 వేల కోట్లు అని గతంలో చెప్పానుగానీ ఆఫ్సెట్ కాంట్రాక్టులను కలుపుకొంటే ఆ విలువ రూ.1.3 లక్షల కోట్లు’ అని రాహుల్ ట్వీట్‌చేశారు. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో మోదీ స్నేహితుడికి 20 బిలియన్ల డాలర్ల (సుమారు 1.30 లక్షల కోట్లు) లబ్ధి చేకూరిందని రాహుల్ ఆరోపించారు. ఈ విషయంలో మోదీ, రక్షణ మంత్రి అబద్ధాలాడుతున్నారని ఆరోపణలు చేశారు. మోదీ.. డోక్లాం గురించి మరిచారా? ‘బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలసి పలు అంశాలు చర్చించినా డోక్లాంను ప్రస్తావించడం మరిచారు. ఈ ప్రభుత్వం దేశ సరిహద్దులు, జాతి భద్రత విషయంలో ఎప్పుడు ధైర్యం చేసి మాట్లాడుతుందో.. కళ్లెర్ర జేసి, ఛాతీ 56 అంగుళాలకు పెంచుతుందో.. 132 కోట్ల మంది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
రఫల్ విమానాల కొనుగోలు గొప్ప నిర్ణయం
న్యూఢిల్లీ: రఫల్ యుద్ధ విమానాలను రెండేళ్లలో భారత వైమానిక దళంలో ప్రవేశపెడతామని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం గొప్ప నిర్ణయమన్నారు. గత 17 ఏళ్లుగా కొలిక్కిరాని అంశంపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారన్నారు. భారత వాయుసేన అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కార్యక్షేత్రంలో దూకడానికి సిద్ధంగా ఉన్న 36 రఫల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 126 రఫల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మూడేళ్లుగా భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరుగుతున్న చర్చల్లో అధిక ధరపై ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆ వివాదానికి తెరపడింది. -
36 రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు
* ఫ్రాన్స్‌తో 17 ఒప్పందాలు * జైతాపూర్ అణుకేంద్రంపై తొలగిన ప్రతిష్టంభన పారిస్: భారత వాయుసేన అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కార్యక్షేత్రంలో దూకడానికి సిద్ధంగా ఉన్న 36 రఫల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్‌తో శుక్రవారం ద్వైపాక్షిక చర్చల తర్వాత ఆయన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 126 రఫల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మూడేళ్లుగా భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరుగుతున్న చర్చల్లో అధిక ధరపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు ప్రభుత్వాల మధ్య ప్రత్యక్షంగా జరిగిన ఈ ఒప్పందంలో భాగంగా సాధ్యమైనంత త్వరగా వాటిని పంపించాలని హోలండ్ను కోరినట్లు మోదీ తెలిపారు. భారత్‌కు ఫ్రాన్స్ అత్యంత విలువైన మిత్రదేశాల్లో ఒకటని అభివర్ణించారు. మోదీ, హోలండ్ చర్చల్లో 17 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మహారాష్ట్రలోని జైతాపూర్‌లో ఆగిపోయి ఉన్న అణు కేంద్ర నిర్మాణానికి సంబంధించిన ఒప్పందం అందులో ఒకటి. భారత్‌కు చెందిన ఎల్ అండ్ టీ, ఎన్‌పీసీఐల్.. ఫ్రాన్స్‌కు చెందిన అరెవాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. మిగతా ఒప్పందాలు: భారత పర్యాటకులకు 48 గంటల్లో వీసా జారీ పథకాన్ని అమలు చేయనున్న ఫ్రాన్స్. భారత్‌లో 100 కోట్ల డాలర్ల ఫ్రాన్స్ పెట్టుబడులు