న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఆర్మీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు వస్తున్న సమయంలోనే వాటి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి హ్యామర్ క్షిపణుల్ని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలుకు సంబంధించిన అధికారాలను అత్యవసర పరిస్థితుల కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ సాయుధ బలగాలకు కట్టబెట్టింది.
ఈ క్షిపణులు గగనతలం నుంచి ఉపరితలానికి 60–70 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలవు. తూర్పు లద్దాఖ్ పర్వత శ్రేణుల నుంచి సరిహద్దుల్లో బంకర్లు, ఇతర శిబిరాలపై దాడులు చేసే అవకాశం హ్యామర్ క్షిపణి ద్వారా వీలు కలుగుతుంది. ‘హ్యామర్ క్షిపణులు కొనుగోలుకి సంబంధించిన ప్రక్రియ మొదలైంది.
అత్యంత స్వల్ప వ్యవధిలోనే రఫేల్ యుద్ధ విమానాలతో పాటు ఈ క్షిపణుల్ని సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించింది’’అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు అత్యవసరంగా ఈ క్షిపణులు అవసరం ఉండడంతో ఇప్పటికే మరొకరికి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్న క్షిపణుల్ని ఫ్రాన్స్ అధికారులు మన దేశానికి తరలిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న ఫ్రాన్స్ నుంచి అయిదు రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి.
‘ప్రశాంతతే బంధాలకు పునాది’
చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట శాంతి, సంయమనం నెలకొనడంపైననే ప్రధానంగా ఆధారపడి ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. ఎల్‌ఏసీ వెంట బలగాల ఉపసంహరణ విషయంలో చైనా నిజాయితీతో వ్యవహరిస్తుందనే ఆశిస్తున్నామని పేర్కొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపునకు సంబంధించి రెండు దేశాల మధ్య మరో విడత దౌత్య చర్చలు త్వరలో ప్రారంభమవుతాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు.
ఎల్‌ఏసీ వెంట యథాపూర్వ స్థితిలో ఎలాంటి ఏకపక్ష మార్పులను భారత్ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా జులై 5న భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి దాదాపు 2 గంటల పాటు ఫోన్‌లో చర్చలు జరిపిన అనంతరం జూలై 6 నుంచి గల్వాన్ లోయలోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment