criticism on modi
-
డబుల్ యువరాజులు x డబుల్ ఇంజిన్ అభివృద్ధి
సమస్థిపూర్/చప్రా/మోతీహరి/బగహ: బిహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల ప్రచార గడవు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్య్టటన చేశారు. నాలుగు వరుస బహిరంగ సభల్లో విపక్ష నేతలపై వాడి విమర్శలతో దండెత్తారు. పశ్చిమ చెంపారన్ జిల్లాలోని బగహలో రెండో దశ ఎన్నికల ప్రచార చివరి సభలో ప్రసంగిస్తూ.. దేశవ్యాప్తంగా నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ప్రచార సభల్లో మాదిరిగానే ఆదివారం నాటి ప్రచారంలోనూ ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ లక్ష్యంగా ప్రధాని విమర్శలు గుప్పించారు. ఈ సారి తేజస్వీయాదవ్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిపి.. ‘వారిద్దరూ జంగిల్ రాజ్ కోసం కృషి చేస్తున్న డబుల్ యువరాజులు’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు యువరాజులు రాష్ట్రాన్ని లాంతర్ల కాలం నుంచి విద్యుత్ వెలుగుల వైపు తీసుకువచ్చిన ఎన్డీయే డబుల్ ఇంజిన్ అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. ‘ఇద్దరు యువరాజుల్లో ఒకరు కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ఒక కూటమిని ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతా తిరిగారు. ఆ కూటమి అక్కడ మట్టికరిచింది. జాగ్రత్త.. ఆ యువరాజు ఇప్పుడు బిహార్‌కు వచ్చాడు. ఇక్కడి ఆటవిక రాజ్య యువరాజుకు మద్దతిస్తున్నాడు. వీరికి వ్యతిరేకంగా డబుల్ ఇంజిన్ అభివృద్ధితో దూసుకుపోతున్న ఎన్డీయే మరోవైపుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘ఆ డబుల్ యువరాజుల ఏకైక లక్ష్యం వారి రాచరికాలను కాపాడుకోవడమే’నన్నారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. తాజా ప్రచారంలో వివాదాస్పద అంశాలైన అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం .. మొదలైన వాటిని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేస్తే జమ్మూకశ్మీర్ ఆందోళనలతో అట్టుడుకిపోతుందని, అక్కడి నదుల్లో రక్తం పారుతుందని కొందరు అమాయక ముఖాలతో భయపెట్టారు. కానీ ఆ ఆర్టికల్‌ను రద్దు చేస్తూ మేం తీసుకున్న నిర్ణయంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుని అవినీతి రహిత పాలనతో అభివృద్ధి వైపు దూసుకువెళ్తున్నారు’ అన్నారు. బిహార్ విపక్ష మహా కూటమిలో సీపీఐఎంఎల్ భాగస్వామి కావటాన్ని ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రంలో ఆటవిక పాలనకు కారణమైన వారు ఇప్పుడు నక్సలిజం మద్దతుదారులతో, తుక్డే తుక్డే గ్యాంగ్‌తో చేతులు కలుపుతున్నారు’ అని పేర్కొన్నారు. ముగిసిన ప్రచారం బిహార్‌లోని 17 జిల్లాల్లో విస్తరించిన 94 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ఆదివారంతో ముగిసింది. వీటిలో మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు ముఖ్యమైనవి. జ్యోతిరాదిత్య సింధియా అనుచరులైన ఎమ్మెల్యేలు ఫిరాయింపునకు పాల్పడటంతో అక్కడ కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి, శివరాజ్‌సింగ్ చౌహాన్ సీఎంగా బీజేపీ సర్కారు ఏర్పాటైన విషయం తెలిసిందే. మెజారిటీ సాధించేందుకు ఈ ఎన్నికల్లో బీజేపీ కనీసం 9 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో యూపీ(7), గుజరాత్(8), ఛత్తీస్‌గఢ్(1), హరియాణా(1), జార్ఖండ్(2), కర్ణాటక(2), ఒడిశా(2), నాగాలాండ్(2), తెలంగాణ(1) ఉన్నాయి. -
కాపలాదారుడే దొంగయ్యాడు
డూంగర్పూర్: ప్రధానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దేశమంతటా వీధుల్లో ఒకే మాట వినిపిస్తోందనీ, దేశ కాపలాదారుడు (మోదీ) దొంగగా మారాడని వారంటున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి ప్రధానిలా కాకుండా కాపలదారుడిలా తాను పనిచేస్తానని గతంలో పలుమార్లు మోదీ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో రాహుల్ గురువారం పర్యటించారు. డూంగర్పూర్ జిల్లాలో ఓ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో మోదీ మౌనంగా ఉన్నారనీ, బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యాను వెనక్కు రప్పించడంలోనూ విఫలమయ్యారని అన్నారు. ఈ అంశాలపై తాను పార్లమెంటులో ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదనీ, ఈ కారణాల వల్లే ప్రధానిని అంతా దొంగ అంటున్నారని పేర్కొన్నారు. 15 మంది పారిశ్రామిక వేత్తలు తీసుకున్న 2.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం.. అప్పుల్లో కూరుకుపోయిన రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఒప్పుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించి, కష్టపడి పనిచేస్తున్న నాయకులకే ఈసారి టికెట్లు ఇస్తామన్నారు. హాస్య యువరాజు రాహుల్: జైట్లీ, స్మృతి మోదీని రాహుల్ దొంగ అనడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయనకు ప్రధాని పదవి అంటే గౌరవం లేకుండా పోయిందని వారు విమర్శించారు. రాహుల్ హాస్య యువరాజుగా మారారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. రాహుల్‌పై ఎదురుదాడి చేస్తూ ఫేస్బుక్లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. రాహులే అన్ని విషయాల్లోనూ తన ప్రభుత్వం గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జైట్లీ ఆరోపించారు. జైట్లీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా స్పందించింది. జైట్లీ విదూషకుడిలా వ్యవహరిస్తున్నారంది. -
అబద్ధాలే బీజేపీ పునాదులు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అధికార బీజేపీకి అబద్ధాలే పునాదులని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ విరుచుకుపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో..లక్షలాది కోట్ల రూపాయల 2జీ స్కాం అంటూ మోదీ,æజైట్లీ తప్పుడు సమాచారంతో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేశారన్నారు. ఒక అబద్ధాన్ని కల్పించటం, దానిని ప్రచారం చేయటం, ప్రజలు నమ్మేదాకా పదేపదే అదే అబద్ధాన్ని చెప్పటం..ఇదే బీజేపీ కుట్ర అని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశాజనకమైన ఫలితాలను సాధించటం, యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన భారీ కుంభకోణం 2జీ కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన మర్నాడే ఈ సమావేశం జరగటం గమనార్హం. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సన్నద్ధతపైనా చర్చించారు. పార్టీలో క్రమశిక్షణ అంశం, నిర్మాణాత్మకంగా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిన పార్టీ నేతల వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా పార్టీకి మార్గదర్శకత్వం వహించి, ఎనలేని సేవలు అందించిన మాజీ అధినేత్రి సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ సీడబ్ల్యూసీ ఒక తీర్మానంచేసింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇకపై రాహుల్ సీడబ్ల్యూసీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఆజాద్, తదితరులతోపాటు రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు. -
10 రోజుల్లో రైతు రుణమాఫీ
లాథి/న్యూఢిల్లీ: గుజరాత్లో తాము అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అసెంబ్లీ పోలింగ్ సమీపిస్తున్న వేళ ఆయన బీజేపీపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. గుజరాత్లో పటీదార్లకు గట్టిపట్టున్న అమ్రేలీ జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాహుల్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ ఐదు–పది మంది పారిశ్రామికవేత్తలైన తన స్నేహితులకు సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. కానీ రైతుల దగ్గరకు వచ్చేసరికి రుణమాఫీ తమ విధానం కాదని మోదీ, ఆర్థికమంత్రి జైట్లీలు వ్యాఖ్యానిస్తున్నారు’ అని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పటీదార్లు, దళితులు, అంగన్వాడీ కార్యకర్తలు, రైతులు సహా సమాజంలో అన్నివర్గాలు ఉద్యమిస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ తప్పుడు ఆర్థిక నిర్ణయాలకు, ప్రచారానికయ్యే ఖర్చును గుజరాతీలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు. 1995లో రూ.9,183 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణం, 2017 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం ఒక్కో గుజరాతీ రూ.37వేల రుణభారాన్ని కలిగి ఉన్నాడన్నారు. -
మాజీ మంత్రికి పార్టీ నుంచి ఉద్వాసన
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్ శౌరి ఇక తమ పార్టీ సభ్యుడు కాడని బీజేపీ స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆయనను తప్పించాలని వెంటనే నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇటీవలి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సమయంలో తన సభ్యత్వాన్ని ఆయన రెన్యువల్ చేసుకోకపోవడంతో ఇప్పుడు ఆయన తమ పార్టీ సభ్యుడు కాడని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఆరేళ్లకోసారి ప్రతి సభ్యుడు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలని, కానీ, అరుణ్ శౌరి ఈసారి అలా చేయలేదని అన్నారు. ఇక అరుణ్ శౌరి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఖండించారు. ఆయన చెప్పిన విషయాలు పార్టీ అభిప్రాయాలు కావు, ప్రజల అభిప్రాయాలు కూడా కావని అన్నారు. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోదీకి గట్టి మద్దతుదారుగా ఉన్న అరుణ్ శౌరి.. ఇటీవలి కాలంలో సర్కారుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయడం అంటే పత్రికల్లో ప్రధానవార్తలను మేనేజ్ చేయడం అని కేంద్రం అనుకుంటోందని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనా కాలం ప్రజలకు గుర్తుకొస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఆవు కలిపితే ప్రస్తుత ప్రభుత్వ విధానంలా ఉందని విమర్శించారు. అయితే ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఒక్క స్కాం గానీ, చివరకు ఒక్క తప్పు గానీ జరిగిన దాఖలాలు లేవని వెంకయ్యనాయుడు సమాధానం ఇచ్చారు. శౌరికి తన సొంత అభిప్రాయాలు ఉండొచ్చుగానీ, దేశ వాసుల అభిప్రాయం వేరని ఆయన అన్నారు.