మాజీ మంత్రికి పార్టీ నుంచి ఉద్వాసన
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్ శౌరి ఇక తమ పార్టీ సభ్యుడు కాడని బీజేపీ స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆయనను తప్పించాలని వెంటనే నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇటీవలి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సమయంలో తన సభ్యత్వాన్ని ఆయన రెన్యువల్ చేసుకోకపోవడంతో ఇప్పుడు ఆయన తమ పార్టీ సభ్యుడు కాడని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఆరేళ్లకోసారి ప్రతి సభ్యుడు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలని, కానీ, అరుణ్ శౌరి ఈసారి అలా చేయలేదని అన్నారు.
ఇక అరుణ్ శౌరి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఖండించారు. ఆయన చెప్పిన విషయాలు పార్టీ అభిప్రాయాలు కావు, ప్రజల అభిప్రాయాలు కూడా కావని అన్నారు. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోదీకి గట్టి మద్దతుదారుగా ఉన్న అరుణ్ శౌరి.. ఇటీవలి కాలంలో సర్కారుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయడం అంటే పత్రికల్లో ప్రధానవార్తలను మేనేజ్ చేయడం అని కేంద్రం అనుకుంటోందని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనా కాలం ప్రజలకు గుర్తుకొస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఆవు కలిపితే ప్రస్తుత ప్రభుత్వ విధానంలా ఉందని విమర్శించారు.
అయితే ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఒక్క స్కాం గానీ, చివరకు ఒక్క తప్పు గానీ జరిగిన దాఖలాలు లేవని వెంకయ్యనాయుడు సమాధానం ఇచ్చారు. శౌరికి తన సొంత అభిప్రాయాలు ఉండొచ్చుగానీ, దేశ వాసుల అభిప్రాయం వేరని ఆయన అన్నారు.