arun shouri
-
సుప్రీంకోర్టును మోసం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టును కేంద్రం మోసం చేసిందని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. కేంద్రానికి అనుకూలంగా తీర్పు వచ్చేందుకు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. రఫేల్ కేసులో డిసెంబర్ 14న వచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా వారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రీజాయిండర్ అఫిడవిట్లో సుప్రీంకోర్టును కోరారు. తప్పుడు ఆధారాలు చూపి, సరైన పత్రాలను, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వల్ల ఆ తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటికి కూడా నిజమైన పత్రాలను కోర్టు ముందు ఉంచట్లేదని, అందుకే తాము నిజమైన పత్రాలను బహిర్గతపరచాలని డిమాండ్ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ‘సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందజేసిన వివరాలతో కేంద్రం తప్పుదోవపట్టించిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆధారాలను కేంద్రం తొక్కిపట్టి కోర్టు నుంచి తప్పుడు తీర్పు పొందింది’ అని ఆరోపించారు. రఫేల్ కేసు తీర్పుపై సమీక్ష జరపాలని పిటిషన్‌కు సమాధానంగా కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు స్పందనగా ఆ ముగ్గురు రీజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా, రఫేల్ తీర్పుపై సమీక్ష జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరుపుతామని సీజేఐ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. వారి ఆరోపణలు నిరాధారం.. రఫేల్ కొనుగోలు కేసులో పిటిషనర్ల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రక్షణ శాఖ నుంచి లీక్ అయిన పత్రాల ఆధారంగా వచ్చిన వార్తాకథనాలపైనే వారు ఆధారపడ్డారని పేర్కొంది. ఇది కచ్చితంగా అధికారులు వారి విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమే అవుతుందని వెల్లడించింది. -
మాజీ మంత్రికి పార్టీ నుంచి ఉద్వాసన
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్ శౌరి ఇక తమ పార్టీ సభ్యుడు కాడని బీజేపీ స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆయనను తప్పించాలని వెంటనే నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇటీవలి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సమయంలో తన సభ్యత్వాన్ని ఆయన రెన్యువల్ చేసుకోకపోవడంతో ఇప్పుడు ఆయన తమ పార్టీ సభ్యుడు కాడని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఆరేళ్లకోసారి ప్రతి సభ్యుడు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలని, కానీ, అరుణ్ శౌరి ఈసారి అలా చేయలేదని అన్నారు. ఇక అరుణ్ శౌరి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఖండించారు. ఆయన చెప్పిన విషయాలు పార్టీ అభిప్రాయాలు కావు, ప్రజల అభిప్రాయాలు కూడా కావని అన్నారు. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోదీకి గట్టి మద్దతుదారుగా ఉన్న అరుణ్ శౌరి.. ఇటీవలి కాలంలో సర్కారుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థను మేనేజ్ చేయడం అంటే పత్రికల్లో ప్రధానవార్తలను మేనేజ్ చేయడం అని కేంద్రం అనుకుంటోందని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనా కాలం ప్రజలకు గుర్తుకొస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఆవు కలిపితే ప్రస్తుత ప్రభుత్వ విధానంలా ఉందని విమర్శించారు. అయితే ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఒక్క స్కాం గానీ, చివరకు ఒక్క తప్పు గానీ జరిగిన దాఖలాలు లేవని వెంకయ్యనాయుడు సమాధానం ఇచ్చారు. శౌరికి తన సొంత అభిప్రాయాలు ఉండొచ్చుగానీ, దేశ వాసుల అభిప్రాయం వేరని ఆయన అన్నారు.