లాథి/న్యూఢిల్లీ: గుజరాత్‌లో తాము అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అసెంబ్లీ పోలింగ్ సమీపిస్తున్న వేళ ఆయన బీజేపీపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. గుజరాత్‌లో పటీదార్లకు గట్టిపట్టున్న అమ్రేలీ జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాహుల్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ ఐదు–పది మంది పారిశ్రామికవేత్తలైన తన స్నేహితులకు సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారు.
కానీ రైతుల దగ్గరకు వచ్చేసరికి రుణమాఫీ తమ విధానం కాదని మోదీ, ఆర్థికమంత్రి జైట్లీలు వ్యాఖ్యానిస్తున్నారు’ అని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పటీదార్లు, దళితులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, రైతులు సహా సమాజంలో అన్నివర్గాలు ఉద్యమిస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ తప్పుడు ఆర్థిక నిర్ణయాలకు, ప్రచారానికయ్యే ఖర్చును గుజరాతీలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు. 1995లో రూ.9,183 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణం, 2017 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం ఒక్కో గుజరాతీ రూ.37వేల రుణభారాన్ని కలిగి ఉన్నాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment