రాష్ట్రానికి రాహుల్
* రైతుల పరామర్శ
* కాంగ్రెస్‌లో ఉత్సాహం
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశవ్యాప్త పర్యటనలో ఉన్న అఖిలభారత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ వచ్చేనెల రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను రాహుల్ తెలుసుకునేందుకు పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని, ప్రధాని మోదీ పరిపాలనను దుయ్యబడుతూ దేశంలో రాహుల్ పర్యటన సాగుతోంది.
భూసేకరణ చట్టంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నందున అన్నదాతలను పరామర్శించేలా పర్యటనను ఖరారు చేసుకున్నారు. జూన్ 3వ వారంలో రాహుల్ పర్యటన ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పర్యటించే ప్రాంతాలు, తేదీలు ఖరారు కాలేదు. అయితే రైతులను పరామర్శించడమే ప్రధాన అజెండా అనేది మాత్రం ఖరారైంది. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గెయిల్ ఇండియా సంస్థ 340 కోట్లతో కొంజి, కుట్టనాడు, బెంగళూరు మీదుగా మంగళూరు వరకు గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ గ్యాస్‌పైప్‌లైన్ రాష్ట్రంలో కోయంబత్తూరు, తిరుప్పూరు, సేలం, ఈరోడ్డు, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి మీదుగా మంగళూరుకు మళ్లించాలని పథకం రూపొందించారు.
అయితే ఈ గ్యాస్‌పైప్ లైన్ వల్ల తమ పంట పొలాలు నాశనం అవుతాయని రైతుల తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను స్వీకరించకుండా పైప్‌లైన్‌కు గుంతలు తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. మొండివైఖరి అవలంబిస్తే ఆత్మహత్యలు తప్పవని సైతం రైతులు బెదిరిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే రాహుల్‌గాంధీ తిరుచ్చిరాపల్లి, తంజావూరు, నాగపట్టినం జిల్లాలకు వెళ్లి ఆయా ప్రాంతాల రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారని భావిస్తున్నారు. అలాగే తేనీ జిల్లాలో 1500 కోట్లతో భూమికి అడుగుభాగంలో న్యూట్రినో తయారీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
దీనిపై కూడా స్థానికంగానేగాక, రాజకీయంగా కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని రాహుల్ పర్యటనను ఖరారు చేయనున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. విధిలేని పరిస్థితుల్లో ఒంటరిగా పోటీచేసిన కాంగ్రెస్ మట్టికరిచిపోయింది. గెలుపు మాట అటుంచి అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్ర పార్టీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
టీఎన్‌సీసీ అధ్యక్షునిగా జ్ఞానదేశికన్ స్థానంలో ఈవీకేఎస్ ఇళంగోవన్ నియమితులయ్యారు. మాజీ కేంద్రమంత్రి జీకే వాసన్ తమిళమానిల కాంగ్రెస్‌ను స్థాపించగా, జ్ఞానదేశికన్ సైతం అదే పార్టీలో చేరిపోయారు. చిదంబరం కాంగ్రెస్‌తో అంటీఅంటనట్లు వ్యవహరిస్తుండగా, ఆయన కుమారుడు కార్తీ కాంగ్రెస్‌తో విభేదిస్తూ వేరే శిబిరాలను నడుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.