
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై బీజేపీ దాడికి పాల్పడుతోందని, రాజకీయ లబ్ధి కోసం అసత్యాల్ని ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం సత్యాన్ని పరిరక్షించేందుకు పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ 133వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని సవరించాలన్న కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘రాజ్యాంగం అమల్లోకి వచ్చిన క్షణాలు భారతదేశ చరిత్రలో ఎంతో ముఖ్యమైనవి. చివరికి ఆ రాజ్యాంగంపై కూడా దాడి చేస్తున్నారు. దేశానికి పునాదిగా ఉన్న రాజ్యాంగం, అంబేడ్కర్ మనకిచ్చిన రాజ్యాంగంపై దాడి బాధ కలిగిస్తోంది. వెనుక నుంచి దొంగతనంగా దాడి చేస్తున్నారు. అయితే రాజ్యాంగాన్ని, ప్రతీ వ్యక్తికున్న హక్కులు, అభిప్రాయాల్ని పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీదే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత’ అని రాహుల్ పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనం కోసం అసత్య ప్రచారం
అసత్యాలతో బీజేపీ మోసపూరిత వలను అల్లుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటోందని ఆయన విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా, ఎన్నికల్లో ఓడినా సరే సత్య మార్గాన్ని వదిలిపెట్టబోదని, దానిని పరిరక్షిస్తూనే ఉంటుందని చెప్పారు. సత్యమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య సిద్ధాంతమని.. దానిని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత విజయాలను ప్రస్తావించిన రాహుల్.. శతాబ్దానికి పైగా కాంగ్రెస్ దేశ ప్రయోజనాల కోసం పాటుపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఆయన గురువారం అక్బర్ రోడ్డులోని కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీడబ్ల్యూసీ సభ్యులు సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment