రాహుల్ కోసమే రాష్ట్ర విభజన | Rahul for the state Division | Sakshi
Sakshi News home page

రాహుల్ కోసమే రాష్ట్ర విభజన

Published Thu, Aug 15 2013 3:36 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

Rahul for the state Division

ఆనందపురం (కె.కోటపాడు రూరల్), న్యూస్‌లైన్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేయాలని నిర్ణయించుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు ఆరోపించారు. ఆనందపురం గ్రామంలో బుధవారం వైఎస్సార్ సీపీ మండల నేతలు, పలు గ్రామాల కార్యకర్తలు సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ నిర్వహించారు.

మూడురోడ్ల కూడలిలో పార్టీ శ్రేణులు మానవహారంగా ఏర్పడి సోనియా, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చొక్కాకుల, పూడి మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారందరూ కలిసి మెలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మాత్రం రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణలో ఎంపీ సీట్లు పొందాలని చూస్తోందన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల కార్యకర్తలు, అభిమానులు 200 బైక్‌లపై ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్ర నినాదాలను హోరెత్తించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రొంగలి మహేష్, దాట్ల తాతరాజు, ఆళ్ల రామునాయుడు, కొరువాడ సర్పంచ్ చీపురుపల్లి అచ్చిబాబు, లంకవానిపాలెం సర్పంచ్ అవుగడ్డ సోంబాబు తదితరులు పాల్గొన్నారు.

 వైఎస్సార్ బతికుంటే విభజన జరిగేదా?
 మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి బతికుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం జరిగేది కాదని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు అన్నారు. ఎ.కోడూరు గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి బుధవారం ఆయన క్షీరాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయం అమలు కానివ్వొద్దన్న వినతిపత్రాలను వైఎస్ విగ్రహానికి అందించారు. ఈ సందర్భంగా చొక్కాకుల మాట్లాడుతూ వైఎస్సార్ 2004లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తెలంగాణ, సీమాంధ్రలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర ప్రజల్లో నమ్మకమైన నేతగా చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. వైఎస్సార్ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీని 2009లో రాష్ట్ర ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు.

 బైకులతో భారీ ర్యాలీ
 చౌడువాడ (కె.కోటపాడు): సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త పూడి మంగపతిరావు అధ్యక్షతన బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. చౌడువాడ గ్రామం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో మండలం నలుమూలల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ  జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట రావు ముఖ్యఅతిథిగా చౌడువాడలో జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. చౌడువాడ నుంచి గుల్లేపల్లి, గొండుపాలెం, బత్తివానిపాలెం మీదుగా ర్యాలీ ఆనందపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పూడి మంగపతిరావు, రొంగలి మహేష్, దాట్ల తాతరాజు, బండారు నారాయణపాత్రుడు, రెడ్డి జగన్‌మోహన్, దాట్ల శివాజీ, ఏటుకూరి రాజేష్, దాలివలస సర్పంచ్ రొంగలి అమ్మతల్లినాయుడు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement