రాంచీలో జరిగిన ర్యాలీలో మహిళలతో నృత్యం చేస్తున్న రాహుల్
రాంచీ: ‘కాపలాదార్లంతా దొంగలు కారు.. దేశానికి కాపలాదారు (దేశ్‌కా చౌకీదార్) మాత్రమే దొంగ’అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాంచీలో శనివారం జరిగిన బహిరంగ సభ ‘పరివర్తన్ ఉల్గులన్ మహా ర్యాలీ’లో రాహుల్ మాట్లాడుతూ.. ‘కొందరు కాపలాదార్లు ఆ (చౌకీదార్ చోర్ హై)నినాదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తామంతా నిజాయతీ పరులమనీ, ఆ నినాదాన్ని మార్చుకోవాలని సూచించారు. అయితే, ఆందోళన చెందవద్దని వారికి చెప్పా. కాపలాదారే దొంగ నినాదం ప్రధాని మోదీని ఉద్దేశించిందేనన్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. దేశానికి కాపలాదారు మాత్రమే దొంగ. ఈ ఒక్క కాపలాదారు కారణంగా అందరికీ అప్రతిష్ట వచ్చిపడింది’ అని రాహుల్ ఎద్దేవా చేశారు.
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీ రూ.30 వేల కోట్ల మేర తన సన్నిహితుడైన అనిల్ అంబానీకి అక్రమంగా లాభం కలిగేలా చేశారంటూ రాహుల్ ఆరోపిం చారు. ‘వాయుసేన దేశాన్ని రక్షిస్తుండగా మన ప్రధాని మాత్రం సైన్యం నుంచి డబ్బు దోచుకుంటున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, చిన్న దుకాణదారులను పట్టించుకోని ప్రధానమంత్రి పారిశ్రామికవేత్తలకు బ్యాంకు లిచ్చిన రూ.3.5 లక్షల కోట్ల రుణాలను మాత్రం రద్దు చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని అమలు చేసి, పేదల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా డబ్బును జమ చేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు వాగ్దానాలు, తప్పుడు గిమ్మిక్కులు చేసే కాపలాదారు(ప్రధాని) మళ్లీ విఫల మయ్యారని రాహుల్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment