ధులే: పుల్వామా దాడి తర్వాత దేశమంతా ఐక్యమైందంటూనే మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మండిపడ్డారు. అప్పుడే ఐక్యతారాగం.. అంతలోనే రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. పబ్లిసిటీ లేకుండా కేవలం 5 నిమిషాలు కూడా ప్రధాని ఉండలేరని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కాగితపు విమానాలు కూడా తయారు చేయలేరని ఎగతాళి చేశారు. ‘పుల్వామా దాడి తర్వాత ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించొద్దని మా పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పాను.
మనదేశం చేస్తున్న పోరాటానికి అందరం అండగా నిలవాలి’అని ఆయన అన్నారు. ‘పుల్వామా ఉగ్రదాడుల తర్వాత దేశం మొత్తం ఒక్కటైందని మీడియా ముందు చెబుతారు. వెనువెంటనే ఢిల్లీలో జరిగిన అమర వీరుల స్మారకం ప్రారంభోత్సవంలో మమ్మల్ని విమర్శిస్తారు. ఈ ప్రధాని పబ్లిసిటీ లేకుండా 5 నిమిషాలు ఉండలేరు’ అని విమర్శించారు. పీఎం కిసాన్ సమ్మన్ పథకం ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి రోజుకు రూ.17 అందుతాయన్నారు. ‘కుటుంబంలోని ఒక్కొక్కరికి విడిగా లెక్కేస్తే రూ.3.5 వస్తుంది. రూ.3.5 లక్షల పంట రుణం ఉంటే మరోవైపు రూ.3.5 ఇవ్వడానికి మోదీ సిగ్గుపడాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment