న్యూఢిల్లీ: భారత్ దగ్గర రఫేల్ ఫైటర్‌జెట్లు ఉండుంటే ఇటీవల పాకిస్తాన్‌తో తలెత్తిన ఘర్షణల ఫలితం మరోలా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం రఫేల్ యుద్ధవిమానాలు లేనిలోటు స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని జైషే ఉగ్రస్థావరాలపై దాడి సందర్భంగా ప్రపంచమంతా భారత్ కు మద్దతు పలికితే, దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ దాడుల యధార్థతను ప్రశ్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకు తోడు ప్రస్తుతం రఫేల్ ఒప్పందంపై జరుగుతున్న రాజకీయాలతో దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీపై ఉన్న విద్వేషం హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ లాంటి ఉగ్రవాదులకు లబ్ధిచేకూర్చరాదని హితవు పలికారు. ప్రబుత్వ విధానాల్లోని లోపాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తే స్వాగతిస్తామనీ, అయితే దేశభద్రతకు సంబంధించిన విషయాల్లో అడ్డంకులు కల్పించవద్దని సూచించారు. ఢిల్లీలో శనివారం జరిగిన ‘ఇండియాటుడే కాన్‌క్లేవ్ 2019’లో మాట్లాడిన ప్రధాని మోదీ, విపక్షాల తీరును తీవ్రంగా ఎండగట్టారు.
భయం మంచిదే..
భారత్ ఐక్యతను చూసి ఇంటాబయటా చాలామంది భయపడుతున్నారని ప్రధాని అన్నారు. ‘భారత వ్యతిరేక శక్తులు, రుణఎగవేతదారులు, అవినీతిపరులు, కొందరు పెద్దనేతలకు ఇప్పుడు భయం కనిపిస్తోంది. జైలుకు పోతామేమో అని వారంతా భయపడుతున్నారు. నిజానికి భయం మంచిదే. ఎందుకంటే 2009లో తమకు 1.86 లక్షల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కావాలని భద్రతాబలగాలు కోరాయి. కానీ 2009–14 మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను కూడా బలగాలకు అందించలేకపోయారు. ఎన్డీయే ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30 లక్షల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను అందించాం. మా ప్రభుత్వ హయాంలో మధ్యవర్తులు పత్తా లేకుండా పోయారు. ఎందుకంటే మేం అవినీతిని ఎంతమాత్రం సహించబోమని వారికి తెలుసు’ అని మోదీ వెల్లడించారు.
నామీద చాలా అనుమానాలు ఉండేవి..
మోదీ లాంటి నేతలు వస్తూపోతూ ఉంటారనీ, దేశం మాత్రం శాశ్వతంగా ఉంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘మోదీపై విమర్శలదాడి చేసేక్రమంలో వీళ్లు(ప్రతిపక్షాలు) దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. మోదీపై మీ ద్వేషం హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులకు లబ్ధిచేకూర్చేలా మారకూడదు. మన సాయుధ బలగాలు ఏం చెబుతున్నాయో మీరు వినరా? లేదా మాకంటే మీరు శత్రువులనే ఎక్కువగా నమ్ముతున్నారా?’ అని ప్రధాని విపక్షాలను నిలదీశారు.
2014లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తన పై ప్రజలకు చాలా అనుమానాలు ఉండేవని మోదీ గుర్తుచేశారు. ‘అప్పటివరకూ సీఎంగా మాత్రమే ఉన్న నేను ప్రధానిగా ఏ చేస్తానో, విదేశీ విధానం ఏమవుతుందో అని ప్రజలకు అనుమానం ఉండేది. అది మామూలే. ఎందు కంటే నా కుటుంబానికి రాజకీయ నేపథ్యమేదీ లేదు. అలాగే నా ఇంట్లో ఆరుగురు అధికారం వెలగబెట్టలేదు’ అని మోదీ చెప్పగానే సభికులు హర్షధ్వానాలు చేశారు. ప్రజల అంచనాలు అందుకోవడంలో సఫలమయ్యాననే తాను భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. 21వ శతాబ్దం భారత్‌దేనని ప్రధాని స్పష్టం చేశారు.
రఫేల్ ఉంటే ఫలితం మరోలా ఉండేది
Published Sun, Mar 3 2019 5:17 AM | Last Updated on Sun, Mar 3 2019 5:26 AM
Comments
Please login to add a commentAdd a comment