సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చిందనీ, ఇక మనతో సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఇస్లామాబాద్ నిర్ణయించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. దేశ వర్తమాన పరిస్థితులపై ప్రముఖులతో చర్చలు నిర్వహించేందుకు ఇండియా టుడే మీడియా గ్రూపు నిర్వహిస్తున్న ఇండియా టుడే కాంక్లేవ్–2019 శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. శనివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి రోజు సదస్సును ప్రారంభిస్తూ ఇండియా టుడే ఎడిటర్ ఇన్ ఛీఫ్ అరుణ్ పురీ స్వాగతోపాన్యాసం ఇచ్చారు.
‘రానున్న ఎన్నికలు అనేక మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవి. సంకీర్ణ ప్రభుత్వాల కంటే సంపూర్ణ మెజారిటీ గల ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందా? దేశం ఒక గట్టి ఆధిపత్యం ఉండే నాయకుడిని కోరుకుంటోందా? లేక కేవలం మంచి టీమ్‌ను కోరుకుంటోందా? పుల్వామా దాడి ఘటన ఎన్నికలపై ఏమేర ప్రభావం చూపుతుంది.. వంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఇక కాంక్లేవ్‌లో తొలి వక్త బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ‘ఎన్నికల డైరీలు: విజయాలు, ఓటములు, ప్రజాస్వామిక రణక్షేత్ర సారాంశం’ అనే అంశంపై ప్రసంగించారు.
‘మోదీ నాయకత్వంలో దేశం పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చింది. సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఇస్లామాబాద్ నిర్ణయించుకోవాలి’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ పుల్వామా దాడిని ఖండించకపోవడంపై ఆయన మండిపడ్డారు. సాంస్కృతిక వైరాలపై కాంగ్రెస్ నేత శశిథరూర్, బీజేపీ నేత వినయ్ సహస్ర బుద్దే ప్రసంగించారు. మహిళా శక్తిపై క్రీడాకారులు మేరీకోమ్, మిథాలీ రాజ్ ఉపన్యాసాలు ఇచ్చారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దేశభక్తి అనే అంశంపై ప్రసంగించారు. శనివారం మోదీతోపాటు పలువురు వక్తలు ప్రసంగించనున్నారు.
ప్రధాని రేసులో లేను: గడ్కరీ
ఈ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘బీజేపీ రాజకీయ విజయాలకు రోడ్‌మ్యాప్’ అన్న అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త అడిగిన ప్రశ్నకు గడ్కరీ స్పందిస్తూ ‘మేమంతా మోదీ వెనక ఉన్నాం. ఆయన విజన్ విజయవంతం చేయడంలో నేనొక కార్యకర్తను. ఇక ప్రధాన మంత్రి పదవి రేసులో నేనున్నానన్న ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది?’ అని ప్రశ్నించారు. ‘మోదీ ప్రధానమంత్రి. తదుపరి ప్రధాన మంత్రి కూడా ఆయనే. నేను ప్రధాన మంత్రి రేసులో లేను. అలాంటి కల నేను కనలేదు’ అని వ్యాఖ్యానించారు.
పైలట్ పాక్ చెరలో ఉంటే.. ఎన్నికల భేటీలా?
‘కాంగ్రెస్ సన్నాహాలు, ఆత్మపరిశీలన’ అన్న అంశాలపై కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్, జ్యోతిరాధిత్య సింధియా ప్రసంగించారు. ‘పాక్ ప్రతీకార దాడుల్ని వీరోచితంగా అడ్డుకొని పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్– 16 యుద్ధ విమానాన్ని నేలకూల్చిన మన పైలట్ ఆ క్రమంలో తన విమానం శత్రు భూభాగంలో నేలకూలడంతో పాక్‌కు బందీగా చిక్కాడు. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం తీవ్ర ఉద్విగ్న స్థితిలో ఉంటే మన ప్రధాని మాత్రం బూత్ కమిటీ సభ్యులతో రాజకీయ సమావేశం నిర్వహించడం నన్ను విస్మయానికి గురిచేసింది.
పైలట్ పాక్‌లో చిక్కుకుంటే మోదీ ఎన్నికల భేటీలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం?’ అని సింధియా ప్రశ్నించారు. రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘ఒకవైపు పాక్ దాడులకు తెగబడుతుంటే ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ముందుండి దేశానికి దిశా నిర్దేశం చేయాలి. ఆ సమయంలో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడి ఉండాల్సింది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పినట్లయ్యేది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment