న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి భారీ కుదుపు(జబర్దస్త్ ఝట్కా)గా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. కొద్దిపాటి మెజార్టీతో బీజేపీ గెలిచిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ విశ్వసనీయతపై సందేహాలున్నాయని, దేశ ప్రజలు మోదీ మాటల్ని విశ్వసించడం లేదనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. అభివృద్ధి, జీఎస్టీ వంటి సంస్కరణలకు ప్రజలు పట్టం కట్టినట్లైతే.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆ అంశాల్ని మోదీ ఎందుకు ప్రస్తావించలేదని రాహుల్ ప్రశ్నించారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మంగళవారం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. ‘మోదీ గుజరాత్ అభివృద్ధి నమూనా.. ఒక మంచి ప్రచార ఆర్భాటం, తెలివైన మార్కెటింగ్ వ్యూహం.. అయితే ఆ నమూనా అంతా డొల్ల.. దానిని ఆ రాష్ట్ర ప్రజలే ఆమోదించరని నాకు అర్థమైంది’ అని చెప్పారు. గుజరాత్‌లో కాంగ్రెస్ చాలా మంచి ఫలితాల్ని సాధించిందని, ఆ పార్టీదే నైతిక విజయమని పేర్కొన్నారు. ‘గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై పోరాడలేదని అనుకున్నారు. మీరు ఫలితాలు చూశారు. అవి బీజేపీకి భారీ కుదుపు .. మనం ఓడిపోయాం. కొద్ది పాటి మెజార్టీ తగ్గింది లేదంటే మనం గెలిచేవాళ్లం’ అని చెప్పారు.
అమిత్ షా కుమారుడి అవినీతిపై మాట్లాడరా?
ప్రధాని విశ్వసనీయతను ప్రశ్నిస్తూ.. మోదీ అదే పనిగా అవినీతి గురించి మాట్లాడారని.. అయితే అమిత్ షా కుమారుడు జే షా గురించి, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతిపై ఎందుకు ఒక్క మాట ఉచ్ఛరించలేదని రాహుల్ నిలదీశారు. ‘జే షా మూడు నెలల్లో రూ. 50 వేల నుంచి రూ. 80 కోట్లకు ఎలా ఎదిగారు. రాఫెల్ విమానాల ఒప్పందంలో అవినీతి జరిగింది. వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడరు. మోదీ విశ్వసనీయతపై సందేహం నెలకొంది. ఆయన చెబుతున్న మాటలను దేశం విశ్వసించడం లేదు. గుజరాత్ ఎన్నికల్లో అది రుజువైంది. రాబోయే రోజుల్లో ఆ విషయం మీకు బాగా స్పష్టమవుతుంది’ అని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఆజాద్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్తేజాన్ని నింపాయి. దీంతో ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు సొంతింటిని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. కొన్నేళ్లుగా కీలక పదవుల్లో ఉన్నవారిని తొలగించి పార్టీకి కొత్త రక్తం ఎక్కించనున్నారు. ఇందులో భాగంగా సుదీర్ఘ అనుభవం కలిగిన గులాం నబీ ఆజాద్‌ను ఉపాధ్యక్షుడిగా నియమించే అంశంపై ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొన్నటిదాకా రాహుల్ ఈ పదవిలోనే ఉండి అధ్యక్షురాలు సోనియాగాంధీకి చేదోడువాదోడుగా ఉన్న విషయం తెలిసిందే.
జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆజాద్ ఆ రాష్ట్రానికి సీఎంగా, ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ హయాం వరకు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, ఉత్తరప్రదేశ్ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. సోనియా నమ్మినబంటు అహ్మద్ పటేల్‌తో రాహుల్‌కు భవిష్యత్‌లో ఎప్పుడైనా పొసగకపోతే ఆజాద్ రాహుల్‌కు అక్కరకొస్తారు. రాహుల్, అహ్మద్ పటేల్‌కు మధ్య సఖ్యత కుదిర్చేందుకు సోనియా గతంలో పలుమార్లు యత్నించారు. అయినా ఆయన్ని రాహుల్ తన బృంద సభ్యుడిగా కొనసాగిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment