రాహుల్ కారుపై రాళ్ల దాడి
► పగిలిన కారు అద్దాలు.. రాహుల్ క్షేమం
► గుజరాత్ వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఘటన
► ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు
► దాడి బీజేపీ కార్యకర్తల పనేనని కాంగ్రెస్ విమర్శ
ధనేరా/న్యూఢిల్లీ: గుజరాత్‌లో వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాహనంపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో రాహుల్ కారు అద్దాలు పగిలిపోయాయి. ప్రత్యేక భద్రత దళం(ఎస్‌పీజీ) వెంటనే అప్రమత్తమవటంతో ఆయన ఎలాంటి గాయాల్లేకుండానే క్షేమంగా బయటపడ్డారు. పిరికిపందల చర్యలకు తాను భయపడనని రాహుల్ అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఘటనలపై మండిపడింది. బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని విమర్శించింది. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ అవకాశవాద రాజకీయాలకు విసిగి ప్రజలే దాyì చేశారని పేర్కొంది.
అసలేం జరిగింది?.. తాజా వరదలకు అతలాకుతలమైన రాజస్తాన్, ఉత్తర గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యలను రాహుల్ గాంధీ పరిశీలించారు. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం గుజరాత్‌లోని బనాస్కాంత జిల్లాలో రాహుల్ పర్యటించారు. ఈ జిల్లాలోని పలు గ్రామాల్లో బాధితులతో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడేందుకు ధనేరాలోని మార్కెటింగ్ యార్డుకు రాహుల్ చేరుకున్నారు. లాల్‌చౌక్ ప్రాంతంలో స్థానికులను, రైతులనుద్దేశించి ఆయన మాట్లాడేందుకు సిద్ధమవగానే స్థానికులు నల్లజెండాలతో నిరసన తెలపటంతోపాటు మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి ప్రజలను చెదరగొట్టారు.
ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన రాహుల్ అక్కడినుంచి వెళ్లిపోతున్న సమయంలో ప్రజలు వాటర్ ప్యాకెట్లను కాన్వాయ్‌పైకి విసిరారు. కాన్వాయ్ ధనేరా హెలిప్యాడ్ సమీపంలోకి రాగానే.. కొందరు నిరసనకారులు రాహుల్ వాహనంపైకి రాళ్లురువ్వారు. దీంతో రాహుల్ ప్రయాణిస్తున్న కారు ఒకవైపు అద్దాలు పగిలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన ఎస్పీజీ దళం రాహుల్‌ను వాహనం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎస్పీజీ దళ సభ్యుడికి స్వల్ప గాయాలయ్యాయి. రాయి విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధనేరా ఎమ్మెల్యే జోయ్‌తాభాయ్ పటేల్ (కాంగ్రెస్) ప్రస్తుతం బెంగళూరు ఈగల్‌టన్ రిసార్టులోని క్యాంపులో ఉన్నారు.
కాగా, తనపై దాడి చేస్తే భయపడేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. ‘ఇలాంటి పిరికిపంద చర్యలకు, మోదీ మోదీ అంటూ చేసే నినాదాలకు నేను భయపడను. మీ బాధలను విని, అర్థం చేసుకునేందుకు వచ్చాను. వీలైనంత సాయం చేద్దామనుకున్నాను. సత్యాన్ని చూడాలనుకోని, అర్థం చేసుకోలేని వారే భయపడతారు. నేను కాదు’ అని దాడి అనంతరం రాహుల్ ట్వీట్ చేశారు. ఘటన జరిగిన సమయంలో కాంగ్రెస్ నేత, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు.
బీజేపీ గూండాలపనే: కాంగ్రెస్
రాహుల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తే బీజేపీ గూండాలు సిమెంటు ఇటుకలతో దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
రాహుల్‌వి ‘ఫొటో’ రాజకీయాలు: బీజేపీ
గుజరాత్, రాజస్తాన్‌లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన ఫొటో రాజకీయం చేసేందుకేనని బీజేపీ విమర్శించింది. ‘ప్రజలను గూండాలు, రౌడీలని అనొద్దు. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్టులో ఎంజాయ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ఆయన పార్టీ చేస్తున్న రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. అందుకే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు.