న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైరి పక్షాలైన ఎస్పీ, బీఎస్పీలు రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయాలు తగ్గిపోయే అవకాశాలున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్ని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల మధ్య పోరుగా చిత్రీకరించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే విపక్షాలనన్నింటిని కలిపి మహాకూటమిగా అభివర్ణిస్తూ, ఎన్నికల్ని మోదీ పాలనపై రిఫరెండంగా ప్రచారం చేయాలనుకుంటోంది. అదే జరిగితే మోదీకి తిరుగుండదని, ప్రజాదరణలో మోదీని ఓడించడం కష్టమని కాషాయ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కానీ ఎస్పీ–బీఎస్పీ కూటమితో బీజేపీకి కొత్త తలనొప్పులు తలెత్తే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో సార్వత్రిక ఎన్నికలకు ఏదో ఒకే అంశాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకుని బరిలోకి దిగేవారు. కానీ ఇప్పుడు జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రాథమ్యాలు మారి పోయాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎజెండా, ప్రచారాస్త్రంతో పోటీకి దిగడం జాతీయ పార్టీకి కత్తిమీద సాముగా మారింది. అసలే దక్షిణాదిలో బీజేపీ కేడర్ అంతంత మాత్రమే. ఎస్పీ–బీఎస్పీ బాటలోనే ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా నడిస్తే బీజేపీ అవకాశాలు మరింత కుంచించుకుపోతాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్ని మోదీ పాలనకు రిఫరెండంగా భావించే పరిస్థితి కూడా ఉండదు.
అప్పుడలా..ఇప్పుడిలా..
కాగితంపై చూస్తే ఎస్పీ–బీఎస్పీ కూటమికి బీసీలు, దళితులు, ముస్లింలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో ఈ రెండు పార్టీ లు విడివిడిగా పోటీచేయడంతో ఓట్ల చీలికతో బీజేపీ లబ్ధి పొందిందన్నది కాదనలేని వాస్తవం. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో జతకట్టిన ఎస్పీ–బీఎస్పీలు అప్పటికే బలోపేతమైన బీజేపీని ఓడించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. ఇక 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీల ఉమ్మడి ఓటు షేరు 42.1 శాతం కాగా, బీజేపీకి 42.6 శాతం ఓట్లు దక్కాయి. ప్రస్తుతం బీజేపీ ఓట్ల శాతం ఒకటో, రెండో పాయింట్లు పడిపోయి ఉంటుందని అంచనావేస్తున్నారు. తన ఓట్లను ఎస్పీకి బదిలీచేయగలనని గతేడా ది జరిగిన ఉపఎన్నికలో బీఎస్పీ నిరూపించింది. మాయావతి ప్రధాని అభ్యర్థిత్వానికి అఖిలేశ్ మద్దతుపలకడం, ఆమెను అవమానిస్తే తననూ అవమానించినట్లేనని పార్టీ కార్యకర్తలకు సూచించడం ద్వారా ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు కలసి పనిచేసేలా ప్రోత్సహించారు.
‘వర్ణ’ రాజకీయాలే కీలకం: 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో అధిక సీట్లు గెలుచుకోవడమే బీజేపీకి మొదటి సవాల్. ఇందుకోసం ఆ పార్టీ వేర్వేరు వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. దళితులు, అధిక సంఖ్యాక ఓబీసీల్లో పార్టీ పట్ల ఉన్న వ్యతిరేక భావాన్ని ఎదుర్కోవడం ప్రధానమైంది. కానీ, యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక బీజేపీలోనే ఓబీసీ రాజకీయాలు చాపకింద నీరులా పెరిగిపోవడం అసలు సమస్యగా మారింది. అగ్రవర్ణాల్లో ఉన్న పార్టీ వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మోదీ నిరుపేదలకు 10 శాతం కోటా తీసుకువచ్చారు. అయోధ్యలో రామాలయాన్ని బీజేపీ నిర్మించనుందనే అంచనాలు హిందుత్వ ఓటర్లలో పెరిగిపోయాయి. కుంభమేళా సందర్భంగా జరిగే ధర్మ సంసద్‌లో హిందుత్వ వాదులు తమ గళాన్ని మరింత తీవ్రంగా వినిపించే అవకాశాలున్నాయి. అదే జరిగితే బీజేపీ వైఖరికి, హిందుత్వ అతివాదానికి మధ్య మోదీ సయోధ్య ఎలా కుదుర్చుతారో వేచి చూడాలి.
తగ్గనున్న కాంగ్రెస్ స్థాయి
ఎస్పీ, బీఎస్పీ కూటమి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒకే నినాదం, ఒకే అజెండాతో ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. మాయావతి, అఖిలేశ్ కలిసి కాంగ్రెస్‌ను కూటమిలో చోటివ్వక పోవడం ద్వారా ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లయింది. మిగతా ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ఇదే బాటను అనుసరిస్తూ కాంగ్రెస్‌ను పక్కనబెట్టడమో లేదా ఇష్టం లేకున్నా రాష్ట్ర స్థాయిలో పొత్తులు పెట్టుకోవడమో చేసేందుకు ఈ పరిణామం దోహదపడింది. అఖిలేశ్, మాయావతి కలయిక.. మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ వంటి జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం అక్కర్లేదు.. రాష్ట్ర స్థాయిలో ఏకమైతే చాలనే సందేశాన్ని మిగతా పార్టీలకు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment