మఘర్‌లో సంత్ కబీర్‌దాస్ సమాధి వద్ద చాదర్ సమర్పించి పూలమాల వేస్తున్న మోదీ
మఘర్ (యూపీ): స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలన్నీ చేతులు కలిపి సమాజంలో అనిశ్చితి సృష్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 1975లో ఎమర్జెన్సీ విధించిన వారు, అప్పుడు దాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు కలిసి ఒకే కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మఘర్‌లో 15వ శతాబ్దం నాటి కవి, తత్వవేత్త కబీర్ దాస్ 500వ వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ.. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో విపక్షాలపై నిప్పులుగక్కారు. ‘అధికారం కోసం ఎంతకైనా దిగజారేందుకు సిద్ధమయ్యారు.
ఎమర్జెన్సీని విధించిన వారు, దీన్ని అప్పుడు వ్యతిరేకించినవారు.. నేడు కలసి నడుస్తున్నారు. ఇది కేవలం అధికారాన్ని దక్కించుకోవడానికే. వారికి దేశం, సమాజ సంక్షేమం గురించి పట్టింపు లేదు. కేవలం తమ కుటుంబ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని పనిచేశారు. తమ జేబులు నింపుకునేందుకు పేదలు, అణగారిన, బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేశారు. కోట్ల విలువైన భవంతులు కట్టుకుంటున్నారు’ అని మోదీ విమర్శించారు. కుల, మతాలకు అతీతంగా సమాజంలో అందరూ ఉండాలంటూ తన కవితలతో ప్రచారం చేసిన కబీర్ దాస్ మఘర్‌లోనే తుదిశ్వాస విడిచారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయే.
ఎస్పీ, బీఎస్పీలపై విమర్శలు
‘ఒకవేళ సమాజంలో అనిశ్చితి ఏర్పడితే.. అది తమకు రాజకీయంగా లాభిస్తుందనేది వారి ఆలోచన. కానీ వారు వాస్తవం నుంచి చాలా దూరంలో ఉన్నారు. సంత్ కబీర్, అంబేడ్కర్, మహాత్మాగాంధీ వంటి మహామహులు పుట్టిన ఈ దేశంలోని ప్రజల మనసుల్లో ఏముందో అర్థం చేసుకోలేకపోతున్నారు. సమాజ్‌వాద్, బహుజన్ అని చెప్పుకుంటున్న వారంతా పూర్తి స్వార్థపరులు’ అని పరోక్షంగా ఎస్పీ, బీఎస్పీలపై ప్రధాని విమర్శలు చేశారు. ‘కబీర్ దాస్‌తోపాటు, రాయ్‌దాస్, మహాత్మా పూలే, గాంధీ, అంబేడ్కర్ తదితరులు సమాజంలోని అసమానతలు తొలగిపోవాలని చాలా కృషిచేశారు. దురదృష్టవశాత్తూ.. సమాజంలో విభజన తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకే.. కొందరు ఈ మహామహుల పేర్లను వాడుకుంటున్నారు’ అని ప్రధాని ఆరోపించారు. మఘర్‌ను ప్రపంచ సామాజిక సామరస్య కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కబీర్ సమాధి వద్ద మోదీ చాదర్ సమర్శించారు. సంత్ కబీర్ అకాడెమీకి శంకుస్థాపన చేశారు.
విలువైన నేత పీవీ
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 97వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశచరిత్రలో అత్యంత సంకట పరిస్థితుల్లో పీవీ చూపిన విలువైన నాయకత్వ పటిమ మరువలేమని ప్రశంసించారు. ‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విలువైన నాయకుడు. అద్భుతమైన రాజనీతిజ్ఞతతో దేశ చరిత్రలో క్లిష్టమైన సమయాల్లో తన గొప్ప నాయకత్వ లక్షణాలతో దేశాన్ని ముందుకు నడిపారు. అద్భుతమైన మేధస్సు ఆయన సొంతం’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment