Selfish politics
-
బద్వేల్.. ఓ బలిపీఠం.. వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బలిపీఠంగా మారింది. ఉన్నత ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారంతా క్రమేపీ తెరమరుగయ్యారు. అటు ఉద్యోగానికి దూరమై, ఇటు స్థానిక నాయకత్వాన్ని మెప్పించలేక రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ఆయా అభ్యర్థుల పట్ల అధినేత చంద్రబాబు సైతం ఆదరణ చూపకపోగా..వారిని కరివేపాకు చందంగా అవసరానికి వాడుకొని వదిలేశారు. ఇప్పటివరకు ముగ్గురికి ప్రత్యక్షంగా ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బద్వేల్ నియోజకవర్గంలో దివంగత నేత బిజివేముల వీరారెడ్డిదే ఆధిపత్యం. ఆయన మరణానంతరం 2001 ఉప ఎన్నికల్లో వీరారెడ్డి కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అరంగేట్రంతోనే విజయం సాధించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీదే హవా సాగింది. అనంతరం వైఎస్సార్సీపీ ఆవిర్భావమయ్యాక..మరో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. 2009లో బద్వేల్ ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థికి మరోమారు అవకాశం లేకుండా స్థానిక నాయకత్వం మోకాలడ్డుతోంది. అమృత్‌కుమార్ నుంచి డాక్టర్ రాజశేఖర్ వరకూ.. అధ్యాపకునిగా స్థిరపడిన లక్కినేని అమృత్‌కుమార్ (చెన్నయ్య) 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా..ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2014 ఎన్నికల నాటికి లక్కినేని పార్టీలో కనుమరుగయ్యారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న ఎన్డీ విజయజ్యోతి 2014 టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల నాటికి విజయజ్యోతిని కూడా తెరమరుగు చేశారు. అప్పట్లో ప్రభుత్వ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓబులాపురం రాజశేఖర్‌కు అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల నాటికి డాక్టర్ రాజశేఖర్ రాజకీయ ప్రస్థానమూ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్నను తెరపైకి తీసుకువచ్చారు. బొజ్జాతో ఉద్యోగానికి రాజీనామా చేయించి టీడీపీ అభ్యర్థిగా శ్రేణులకు పరిచయం చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరిని అవసరానికి వాడుకొని వదిలేస్తుండటం రివాజుగా మారిపోయింది. బాబుది సైతం అదే ధోరణి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబానిదే టీడీపీలో ఆధిపత్యం. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా విజయమ్మ మెప్పు లేకపోతే, ఆయా అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకమే అన్నట్లు తలపిస్తోంది. లక్కినేని చెన్నయ్యతో మొదలు డాక్టర్ రాజశేఖర్ వరకూ చోటుచేసుకున్న పరిస్థితే ఇందుకు ఉదాహరణ. ఉన్నత ఉద్యోగాలను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు కూడా అలాంటి ధోరణినే అవలంబిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై 2021లో చంద్రబాబును నమ్మి పార్టీ తీర్థం పుచ్చుకున్న అప్పటి ఎమ్మెల్యే తిరువీధి జయరాములు కూడా తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే బద్వేల్ టీడీపీ అభ్యర్థుల పాలిట బలిపీఠంగా మారందని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
విపక్షాలు పారిపోయాయి
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభ నుంచి పారిపోయాయని ఎద్దేవా చేశారు. దాన్ని దేశమంతా వీక్షించిందన్నారు. మణిపూర్ హింసాకాండపై చర్చ విషయంలో వాటికి చిత్తశుద్ధే లేదని ఆరోపించారు. మణిపూర్ ప్రజలకు అవి ద్రోహం చేశాయన్నారు. ప్రజా సంక్షేమం కంటే స్వార్థ రాజకీయాలకే విపక్షాలు ప్రాధాన్యమిచ్చాయని దుమ్మెత్తిపోశారు. దాంతో కీలక సమస్యలకు పార్లమెంటులో చర్చ ద్వారా పరిష్కారం సాధించే సువర్ణావకాశం చేజారిందని ఆవేదన వెలిబుచ్చారు. దేశవ్యాప్తంగా విపక్షాలు వ్యాప్తి చేస్తున్న ప్రతికూల భావజాలాన్ని తమ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. పశి్చమ బెంగాల్లో పంచాయతీ రాజ్ పరిషత్‌ను ఉద్దేశించి శనివారం మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. వారికి రాజకీయాలే ముఖ్యం రెండు రోజుల క్రితమే విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని 140 కోట్ల భారతీయుల ఆశీర్వాదంతో ఓడించామని మోదీ అన్నారు. ‘అలాగే వారు వ్యాప్తి చేస్తున్న ప్రతికూలతనూ ఓడించాం. మణిపూర్ అంశంపై చర్చించాలని కేంద్రం భావిస్తోందంటూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యే ముందే విపక్షాలకు లేఖ రాశామని. కానీ ఏం జరిగిందో మీరంతా చూశారు. దానిపై చర్చను అవే అడ్డుకున్నాయి. అంతటి సున్నిత అంశంపై చర్చ జరిగి ఉంటే మణిపూర్ ప్రజలకు కాస్త ఊరటన్నా దక్కి ఉండేది. సమస్యకు కొన్నయినా పరిష్కారాలు దొరికి ఉండేవి. కానీ మణిపూర్ హింసాకాండకు మూల కారణానికి సంబంధించిన వాస్తవాలు విపక్షాలను ఎంతో బాధిస్తాయి. కనుక కావాలనే చర్చను జరగనీయలేదు. అసలు పార్లమెంటులో ఏ చర్చ జరగడమూ వారికి ఇష్టం లేదు. ప్రజల బాధ వాటికి పట్టదు కావాల్సిందల్లా కేవలం రాజకీయాలు’ అంటూ తూర్పారబట్టారు. విపక్షాల నిజ రూపాన్ని దేశ ప్రజల ముందు బట్టబయలు చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ప్రజల విశ్వాసమే నాకు స్ఫూర్తినిస్తుంది. నా ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది’ అని అన్నారు. మమతది అరాచక పాలన గత నెల బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్షాలను భయభ్రాంతులను చేసేందు కు పాలక తృణమూల్ కాంగ్రెస్ భాయోతోత్పాతానికి, బెదిరింపులకు దిగిందని విమర్శించారు. పైగా ప్రజాస్వామ్య పరిరక్షకుల్లా పోజు లు కొడుతోందని మండిపడ్డారు. -
అవినీతిమయ పార్టీలు: ఆప్, కాంగ్రెస్‌లపై మోదీ విసుర్లు
సోలన్ (హిమాచల్‌ప్రదేశ్): ‘‘కరడుగట్టిన నిజాయతీపరుమని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ నిజానికి అత్యంత అవినీతిమయం. ఇకకాంగ్రెసైతే అవినీతికి, స్వార్థ రాజకీయాలకు, ఆశ్రిత పక్షపాతానికి తిరుగులేని గ్యారెంటీ’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కపెట్టారు. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని సుందర్ నగర్లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. స్థిరత్వానికి, అభివృద్ధికే ఓటేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ హిమాలయ రాష్ట్రంతో తనకు సుదీర్ఘ అనుబంధముందని చెప్పారు. అధికార బీజేపీకి వేసే ప్రతి ఓటూ తనకు ఆశీర్వాదమని భావిస్తానన్నారు. ‘‘మీరు వేసే ప్రతి ఓటూ వచ్చే పాతికేళ్ల కాలానికి రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. నేను కమలం పువ్వు గుర్తు చేపట్టి మీ ముందుకొచ్చాను. మా అభ్యర్థులను చూడకండి. కమలం గుర్తును చూసి ఓటేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘కాంగ్రెస్ హయాంలో స్థిరత్వం లేని పాలన వల్ల చిన్న రాష్ట్రాలు ఎంతగానో నష్టపోయాయి. చిన్న రాష్ట్రమని హిమాచల్‌ను కాంగ్రెస్ ఏళ్ల తరబడి చిన్నచూపు చూసింది. అందుకే 21వ శతాబ్దంలో మనకు కావాల్సింది స్థిరమైన, బలమైన ప్రభుత్వాలు. అది బీజేపీకి మాత్రమే సాధ్యం’’ అన్నారు. ‘‘మందులను మాటిమాటికీ మారిస్తే రోగం తగ్గదు. ఎవరికీ మేలు జరగదు. అందుకే అధికార బీజేపీని మళ్లీ గెలిపించండి’’ అని కోరారు. హిమాచల్‌లో ప్రతిసారీ అధికార పార్టీ ఓడటం ఆనవాయితీగా వస్తోంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు గుజరాత్‌తో పాటుగా డిసెంబర్ 8న జరుగుతుంది. -
‘పచ్చ’పన్నాగం బెడిసికొట్టిందా..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాటల్లో అహంకారం.. చేతల్లో విధ్వంసం.. రాజకీయ స్వార్థం కోసం ఎందాకైనా తెగించే తత్వం.. ఇదీ మూడు ముక్కల్లో ప్రతి‘పచ్చ’ పార్టీ వర్గీయుల పరిచయం. జిల్లాలో వీరి స్వార్థ రాజకీయాలకు దేవాలయాలను వేదిక చేసుకున్నారు. విగ్రహ విధ్వంస రాజకీయాలతో విద్వేషాలను ఎగదోసి రాక్షసానందం పొందాలనుకున్నారు. అధికార పార్టీపై అడుగడుగునా బురదజల్లే ప్రయత్నం చేశారు. వాస్తవాలు బయటపడడంతో వీరి కుయుక్తులను చూసి ప్రజలు ఛీ కొట్టారు. అయినా పద్ధతి మార్చుకోలేదు.. పంథా మార్చి శవరాజకీయాలకు తెరలేపారు. వీరి స్వార్థ ప్రయోజనాల కోసం సొంత పార్టీ కార్యకర్తల్నే బలిపశువులుగా మార్చేందుకు సిద్ధమయ్యారనే చర్చ ఆ పార్టీ లో జోరుగా జరుగుతోంది. తాజాగా పలాస నియోజకవర్గంలో జరిగిన టీడీపీ కార్యకర్త ఆత్మహత్య వ్యవహారం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. చదవండి: చంద్రబాబుది ఆర్థిక అరాచకం రాజకీయ స్వార్థం కోసం ఎందాకైనా.. ఇటీవల పలాస నియోజకవర్గంలో జరిగిన సంఘటనపై రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘అన్ని రకాలుగా వాడుకుని వాడిని వదిలేద్దాం’ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు గోవిందరావును ఉద్దేశించి చేసిన వ్యంగ్యాస్త్రాలపై ఇప్పటికే ఆ పార్టీ నాయకుల్లో కలకలం రేపింది. తాజాగా మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటరావు ఆత్మహత్యకు అదే పార్టీకి చెందిన నేతల ఉసిగొలిపే ప్రయత్నాలు ఉన్నట్లు ఇప్పుడిప్పుడే ప్రచారం జరుగుతోంది. పలాస నియోజకవర్గంలో రాద్దాంతం సృష్టించి ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో వెంకటరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఆమె పోలీసులపై చేసిన పరుష పదజాలం నివ్వెరపోయాలా చేసింది. అయితే ఈ ఆత్మహత్య వెనుక ఏమైనా రాజకీయ ఎత్తుగడలకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంచలనంగా ఆడియోలు.. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నిమ్మాడకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కింజరాపు అప్పన్నను టీడీపీ కార్యకర్త వెంకటరావు తీవ్రంగా బెదిరిస్తూ చేసిన ఆడియోలు ప్రస్తుతం బహిర్గతం కావడం సంచలనంగా మారింది. పోలీసుల బెదిరింపుల వల్లే వెంకటరావు మనస్తా పానికి గురై ఆత్యహత్యకు పాల్పడ్డాడు అనేది టీడీపీ నాయకుల వాదన. అచ్చెన్నాయుడు జోలికి వస్తే కాళ్లు నరికేస్తా.. చంపేస్తానంటూ నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి... మనస్తాపానికి ఎలా గురి కాగలడు అనే సందేహం స్థానికంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వెంకటరావు ప్రవర్తన తెలుసుకునేందుకు వెళ్లిన పోలీసులను బెదిరించే క్రమంలో చేసిన ఆత్మహత్య ప్రయత్నంలో అదే పార్టీకి చెందిన నేతల ఉసిగొలిపే కుట్ర ఉందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాజకీయ లబ్ధి కోసం సొంత పార్టీకి చెందిన కార్యకర్తనే బలిగొన్నారంటూ అదే పార్టీకి చెందిన ఓ వర్గం నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. జిల్లాలో టీడీపీ పట్టు సాధించేందుకు కార్యకర్తలను స్వార్థం కోసం వినియోగించుకోవడంపై మండిపడుతున్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు సొంత పార్టీ కార్యకర్తలనే బలి చేస్తారా.. అంటూ స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రతిపక్షాలది స్వార్థ రాజకీయం
మండి: ప్రతిపక్షాలది స్వార్ధంతో కూడిన రాజకీయమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రభుత్వ నిర్వహణలో ప్రస్తుతం రెండు నమూనాలున్నాయని, అందరితో కలిసి, అందరి నమ్మకం, అందరి కృషితో సాగే నమూనా తమది కాగా, సొంత ప్రయోజనాలు, స్వకుటుంబ స్వార్ధం, సొంతవారి ఎదుగుదల లక్ష్యంగా సాగే నమూనా విపక్షానిదని దుయ్యబట్టారు. అదేవిధంగా రెండు రకాల ఆలోచనాధోరణులుంటాయని, తమది వికాస్(అభివృద్ధి) ఆలోచన కాగా, విపక్షానిది విలంబ్(జాప్యం) ఆలోచన అని విమర్శిఃచారు. హిమాచల్ ప్రదేశ్‌లో జైరామ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లైన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన సోమవారం పాల్గొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం(కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వం) వల్ల అనేక ప్రయోజనాలు అందాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో పలు అభివృద్ది ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయని, వివిధ పథకాల అమలు జోరందుకుందని వివరించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని రూ. 28,197 కోట్ల విలువైన 287 పెట్టుబడి ప్రాజెక్టులను ఆరంభించారు. దీంతో పాటు రూ.11,581 కోట్ల విలువైన పథకాలకు శంకుస్థాపన చేశారు. -
ఇక్కడ మేము క్షేమమే బాబూ..
హైదరాబాద్: ఏపీలో రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కోవడం చేతగాని చంద్రబాబు.. తెలంగాణలో నివశిస్తున్న సీమాంధ్రులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధికి పాకులాడడం సిగ్గుచేటని కూకట్‌పల్లికి చెందిన సీమాంధ్ర ప్రాంతవాసులు విమర్శించారు. సోమవారం సాయంత్రం కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్య గ్రౌండ్లో సీమాంధ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, సదాశివరెడ్డి, విజయభాస్కర్, రంగమోహన్, నాగకుమార్, గోపీ, రవీంద్రనాధ్‌ఠాగూర్, ప్రియదర్శిని, పవన్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని మూడున్నర కోట్ల మంది ప్రజల సమాచార గోప్యతకు సంబంధించిన కేసులో తెలంగాణ పోలీసులకు అందిన ఫిర్యాదుతో చిన్నాచితక ఐటీ కంపెనీపై పోలీసులు దాడులు చేస్తే సీమాంధ్రులపై దాడిగా చిత్రీకరించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. (డేటా స్కామ్ డొంక కదులుతోంది!) గత 25–30 ఏళ్లుగా తాము తెలంగాణ ప్రాంతాంలో క్షేమంగా జీవిస్తున్నామని అన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం సీమాంధ్ర ప్రజలను పావులుగా వాడుకోవద్దని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను.. అక్కడి ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొవడం కోసం తప్పుడు దారులు వెతుక్కోవడం ద్వారా చంద్రబాబు తన వక్రబుద్ధిని చాటుకున్నాడని విమర్శించారు. ఐటీ గ్రిడ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, దీనికి తెలుగుదేశం పార్టీ, అక్కడి మంత్రివర్గం మొత్తం ఆందోళన చెందడం చూస్తే ఏదో తప్పు జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు) కాగా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబునాయుడుపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ విభేదాలు చెలరేగే అవకాశం ఉందని, ఇక్కడి ప్రభుత్వం వెంటనే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అనిశ్చితి సృష్టించడమే వారి పని
మఘర్ (యూపీ): స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలన్నీ చేతులు కలిపి సమాజంలో అనిశ్చితి సృష్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 1975లో ఎమర్జెన్సీ విధించిన వారు, అప్పుడు దాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు కలిసి ఒకే కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మఘర్‌లో 15వ శతాబ్దం నాటి కవి, తత్వవేత్త కబీర్ దాస్ 500వ వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ.. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో విపక్షాలపై నిప్పులుగక్కారు. ‘అధికారం కోసం ఎంతకైనా దిగజారేందుకు సిద్ధమయ్యారు. ఎమర్జెన్సీని విధించిన వారు, దీన్ని అప్పుడు వ్యతిరేకించినవారు.. నేడు కలసి నడుస్తున్నారు. ఇది కేవలం అధికారాన్ని దక్కించుకోవడానికే. వారికి దేశం, సమాజ సంక్షేమం గురించి పట్టింపు లేదు. కేవలం తమ కుటుంబ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని పనిచేశారు. తమ జేబులు నింపుకునేందుకు పేదలు, అణగారిన, బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేశారు. కోట్ల విలువైన భవంతులు కట్టుకుంటున్నారు’ అని మోదీ విమర్శించారు. కుల, మతాలకు అతీతంగా సమాజంలో అందరూ ఉండాలంటూ తన కవితలతో ప్రచారం చేసిన కబీర్ దాస్ మఘర్లోనే తుదిశ్వాస విడిచారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయే. ఎస్పీ, బీఎస్పీలపై విమర్శలు ‘ఒకవేళ సమాజంలో అనిశ్చితి ఏర్పడితే.. అది తమకు రాజకీయంగా లాభిస్తుందనేది వారి ఆలోచన. కానీ వారు వాస్తవం నుంచి చాలా దూరంలో ఉన్నారు. సంత్ కబీర్, అంబేడ్కర్, మహాత్మాగాంధీ వంటి మహామహులు పుట్టిన ఈ దేశంలోని ప్రజల మనసుల్లో ఏముందో అర్థం చేసుకోలేకపోతున్నారు. సమాజ్‌వాద్, బహుజన్ అని చెప్పుకుంటున్న వారంతా పూర్తి స్వార్థపరులు’ అని పరోక్షంగా ఎస్పీ, బీఎస్పీలపై ప్రధాని విమర్శలు చేశారు. ‘కబీర్ దాస్తోపాటు, రాయ్దాస్, మహాత్మా పూలే, గాంధీ, అంబేడ్కర్ తదితరులు సమాజంలోని అసమానతలు తొలగిపోవాలని చాలా కృషిచేశారు. దురదృష్టవశాత్తూ.. సమాజంలో విభజన తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకే.. కొందరు ఈ మహామహుల పేర్లను వాడుకుంటున్నారు’ అని ప్రధాని ఆరోపించారు. మఘర్‌ను ప్రపంచ సామాజిక సామరస్య కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కబీర్ సమాధి వద్ద మోదీ చాదర్ సమర్శించారు. సంత్ కబీర్ అకాడెమీకి శంకుస్థాపన చేశారు. విలువైన నేత పీవీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 97వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశచరిత్రలో అత్యంత సంకట పరిస్థితుల్లో పీవీ చూపిన విలువైన నాయకత్వ పటిమ మరువలేమని ప్రశంసించారు. ‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విలువైన నాయకుడు. అద్భుతమైన రాజనీతిజ్ఞతతో దేశ చరిత్రలో క్లిష్టమైన సమయాల్లో తన గొప్ప నాయకత్వ లక్షణాలతో దేశాన్ని ముందుకు నడిపారు. అద్భుతమైన మేధస్సు ఆయన సొంతం’ అని ట్వీట్ చేశారు. -
బుసకొడుతున్న...స్వార్థ రాజకీయం
సాక్షిప్రతినిధి, నల్లగొండ: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పక్కాగా వ్యక్తిగత రాజకీయ ఎజెండాతో పావులు వేగంగా కదుపుతున్నారు. జిల్లాలో సీనియర్ మంత్రి కె.జానారెడ్డిని సైతం తన బుట్టలో వేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటయితే సీఎం పదవిని దక్కించుకునేందుకు కాచుక్కూర్చున్న జానాకు జిల్లాలోని నేతల మద్దతూ అవసరం పడుతుంది. తన అవకాశం కోసం జానా కూడా ఉత్తమ్ తానా అటే తందానా అంటున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అసలు కథ విషయానికి వస్తే... మంత్రి జానారెడ్డికి దగ్గరివాడు, నమ్మకమైన నేతగా పేరున్న యడవెల్లి విజయేందర్‌రెడ్డిని డీసీసీబీ చైర్మన్ పీఠం నుంచి దింపేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఆయన చేత బలవంతంగానైనా సెలవు పెట్టించాలన్న వ్యూహంతో ఉన్నారు. ఇదంతా మంత్రి ఉత్తమ్ వేస్తున్న ఎత్తులో భాగమే. ఆయన మనిషి, డీసీసీబీ వైస్‌చైర్మన్ ముత్తవరపు పాండురంగారావును చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలన్న ముందుచూపు రాజకీయంలో భాగమేనని సమాచారం. ఉత్తమ్ భార్య పద్మావతిని ఈసారి ఎన్నికల్లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలకి దింపాలనుకుంటున్నారు. కోదాడలో గెలుపు సాధించాలంటే అన్ని వర్గాల, కులాల ఓట్లు కీలకం కానున్నాయి. టీడీపీ తరపున కోదాడ ఎంపీపీగా పనిచేసిన పాండురంగారావును ఉత్తమ్ తెలివితో కాంగ్రెస్‌లోకి లాగారు. కాపుగల్లు సింగిల్ విండో చైర్మన్‌గా బోటాబొటి మెజారిటీతో గెలిపించారు. ఈ సారి డీసీసీబీ చైర్మన్ పదవి కోసం బరిలో నిలిచిన వారిలో విజయేందర్‌రెడ్డితో పాటు పాండురంగారావు పేరుకూడా బలంగానే వినిపించింది. కానీ, మంత్రి జానారెడ్డి రెండోసారి కూడా విజయేందర్‌రెడ్డికే చైర్మన్ పద వి దక్కేలా అందర్నీ ఒప్పించగలిగారు. కానీ, మారిన రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు రోజుకో తీరున రంగులు మార్చుకుంటున్నాయి. విజయేందర్‌రెడ్డితో దీర్ఘకాలిక సెలవు పెట్టించి, డెరైక్టర్ల సమావేశంలో ఆమోదముద్ర వేయిస్తే.. ఇక, వైస్‌చైర్మన్‌గా ఉన్న పాండురంగారావు చైర్మన్ పీఠం ఎక్కుతారు. ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో ఆయన కులం ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్థికే పడేలా ప్రచారం చేసుకోవచ్చన్నది మంత్రి ఉత్తమ్ వ్యూహం. తెలంగాణ సీఎం పదవి రేసులో ఎవరెవరున్నా, మంత్రి జానాకు మద్దతు ఇవ్వడంతో పాటు, మరి కొందరి మద్దతును కూడగట్టేందుకు కూడా ఉత్తమ్ సై అన్నారని, ఈ కారణంగానే, మంత్రి జానారెడ్డి విజయేందర్‌రెడ్డితో సెలువు పెట్టించడానికి తలూపారని తెలుస్తోంది. పదవులే పరమావధిగా.. వ్యక్తిగత ఎజెండాతో సాగుతున్న స్వార్థరాజకీయం... మధు స్వభావి అన్న పేరున్న విజయేందర్‌రెడ్డికి మింగుడు పడక పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన డీసీసీబీ డెరైక్టర్ సమావేశం ముందర తాను దీర్ఘకాలిక సెలవు పెడుతున్నట్లు సిద్ధం చేసి లేఖను పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో సెలవును అంగీకరించమని మెజారిటీ డెరైక్టర్లు తిరస్కరించారని వినికిడి. అయితే, కనీసం వచ్చే సమావేశం వరకైనా సెలవును అంగీకరించాలని ఈ సమావేశంలో విజయేందర్‌రెడ్డి కోరారని తెలిసింది. మరో నెల రోజుల్లో డీసీసీబీ కొత్తచైర్మన్గా పాండురంగారావు బాధ్యతలు స్వీకరించడం ఖాయమన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడలో తన భార్యకు టికెట్ తెచ్చుకుని గెలిపించుకునేందుకు, ఒక కులం ఓట్లను పొందేందుకు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తుపాను సృష్టించే పనిలో ఉన్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘‘ఇదంతా మంత్రి ఉత్తమ్ వ్యక్తిగత రాజకీయ ఎజెండాలో భాగమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజ యమ్మ పర్యటనను అడ్డుకోవడం కూడా అంతే. వాస్తవానికి కాంగ్రెస్‌లో ఎవరూ ఆమె పర్యటనకు అడ్డం పడే ఆలోచన కూడా చేయలేదు. ఉత్తమ్ జిల్లా కాంగ్రెస్‌ను ఆగం చేసే పనిలో ఉన్నట్లే కనిపిస్తోంది...’’ అని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.