సాక్షిప్రతినిధి, నల్లగొండ: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పక్కాగా వ్యక్తిగత రాజకీయ ఎజెండాతో పావులు వేగంగా కదుపుతున్నారు. జిల్లాలో సీనియర్ మంత్రి కె.జానారెడ్డిని సైతం తన బుట్టలో వేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటయితే సీఎం పదవిని దక్కించుకునేందుకు కాచుక్కూర్చున్న జానాకు జిల్లాలోని నేతల మద్దతూ అవసరం పడుతుంది. తన అవకాశం కోసం జానా కూడా ఉత్తమ్ తానా అటే తందానా అంటున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అసలు కథ విషయానికి వస్తే... మంత్రి జానారెడ్డికి దగ్గరివాడు, నమ్మకమైన నేతగా పేరున్న యడవెల్లి విజయేందర్‌రెడ్డిని డీసీసీబీ చైర్మన్ పీఠం నుంచి దింపేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఆయన చేత బలవంతంగానైనా సెలవు పెట్టించాలన్న వ్యూహంతో ఉన్నారు. ఇదంతా మంత్రి ఉత్తమ్ వేస్తున్న ఎత్తులో భాగమే.
ఆయన మనిషి, డీసీసీబీ వైస్‌చైర్మన్ ముత్తవరపు పాండురంగారావును చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలన్న ముందుచూపు రాజకీయంలో భాగమేనని సమాచారం. ఉత్తమ్ భార్య పద్మావతిని ఈసారి ఎన్నికల్లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలకి దింపాలనుకుంటున్నారు. కోదాడలో గెలుపు సాధించాలంటే అన్ని వర్గాల, కులాల ఓట్లు కీలకం కానున్నాయి. టీడీపీ తరపున కోదాడ ఎంపీపీగా పనిచేసిన పాండురంగారావును ఉత్తమ్ తెలివితో కాంగ్రెస్‌లోకి లాగారు. కాపుగల్లు సింగిల్ విండో చైర్మన్‌గా బోటాబొటి మెజారిటీతో గెలిపించారు. ఈ సారి డీసీసీబీ చైర్మన్ పదవి కోసం బరిలో నిలిచిన వారిలో విజయేందర్‌రెడ్డితో పాటు పాండురంగారావు పేరుకూడా బలంగానే వినిపించింది. కానీ, మంత్రి జానారెడ్డి రెండోసారి కూడా విజయేందర్‌రెడ్డికే చైర్మన్ పద వి దక్కేలా అందర్నీ ఒప్పించగలిగారు. కానీ, మారిన రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు రోజుకో తీరున రంగులు మార్చుకుంటున్నాయి. విజయేందర్‌రెడ్డితో దీర్ఘకాలిక సెలవు పెట్టించి, డెరైక్టర్ల సమావేశంలో ఆమోదముద్ర వేయిస్తే.. ఇక, వైస్‌చైర్మన్‌గా ఉన్న పాండురంగారావు చైర్మన్ పీఠం ఎక్కుతారు.
ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో ఆయన కులం ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్థికే పడేలా ప్రచారం చేసుకోవచ్చన్నది మంత్రి ఉత్తమ్ వ్యూహం. తెలంగాణ సీఎం పదవి రేసులో ఎవరెవరున్నా, మంత్రి జానాకు మద్దతు ఇవ్వడంతో పాటు, మరి కొందరి మద్దతును కూడగట్టేందుకు కూడా ఉత్తమ్ సై అన్నారని, ఈ కారణంగానే, మంత్రి జానారెడ్డి విజయేందర్‌రెడ్డితో సెలువు పెట్టించడానికి తలూపారని తెలుస్తోంది. పదవులే పరమావధిగా.. వ్యక్తిగత ఎజెండాతో సాగుతున్న స్వార్థరాజకీయం... మధు స్వభావి అన్న పేరున్న విజయేందర్‌రెడ్డికి మింగుడు పడక పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన డీసీసీబీ డెరైక్టర్ సమావేశం ముందర తాను దీర్ఘకాలిక సెలవు పెడుతున్నట్లు సిద్ధం చేసి లేఖను పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో సెలవును అంగీకరించమని మెజారిటీ డెరైక్టర్లు తిరస్కరించారని వినికిడి. అయితే, కనీసం వచ్చే సమావేశం వరకైనా సెలవును అంగీకరించాలని ఈ సమావేశంలో విజయేందర్‌రెడ్డి కోరారని తెలిసింది. మరో నెల రోజుల్లో డీసీసీబీ కొత్తచైర్మన్‌గా పాండురంగారావు బాధ్యతలు స్వీకరించడం ఖాయమన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడలో తన భార్యకు టికెట్ తెచ్చుకుని గెలిపించుకునేందుకు, ఒక కులం ఓట్లను పొందేందుకు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తుపాను సృష్టించే పనిలో ఉన్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘‘ఇదంతా మంత్రి ఉత్తమ్ వ్యక్తిగత రాజకీయ ఎజెండాలో భాగమే. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజ యమ్మ పర్యటనను అడ్డుకోవడం కూడా అంతే. వాస్తవానికి కాంగ్రెస్‌లో ఎవరూ ఆమె పర్యటనకు అడ్డం పడే ఆలోచన కూడా చేయలేదు. ఉత్తమ్ జిల్లా కాంగ్రెస్‌ను ఆగం చేసే పనిలో ఉన్నట్లే కనిపిస్తోంది...’’ అని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.