కేసీఆర్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. ఉమ్మడి జిల్లాకు కలిపి అక్టోబర్ 4వ తేదీన నల్లగొండలో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా నాయకత్వానికి సమాచారం అందింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో సీనియర్లు, ముఖ్యులు జిల్లానుంచే ప్రాతినిధ్య వహిస్తున్నారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈసారీ బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నల్లగొండతోపాటు కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాలలో ఓటమి పాలైంది.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి జిల్లానుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో జిల్లాపై తిరుగులేని పట్టును నిరూపించుకోవాలని టీఆర్‌ఎస్ నాయకత్వం పట్టుదలగా ఉంది. కాంగ్రెస్‌కు జిల్లానుంచే గండి కొట్టాలన్న వ్యూహంలో భాగంగానే కేసీఅర్ రాష్ట్రంలో పాల్గొంటున్న మూడో సభ కోసం నల్లగొండను ఎంపిక చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులపై వస్తున్న వ్యతిరేకతకూ చెక్ పెట్టాలని నాయకత్వం భావిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంపై పట్టు బిగించేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచనలు అందాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ ఈసారి కంచర్ల భూపాల్‌రెడ్డిని బరిలోకి దింపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment