సాక్షి, నల్గొండ : ప్రభుత్వాసుపత్రిలో రోగులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక తల్లి కళ్ళ ముందు కొడుకు మరణించడం బాధనిపించిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు, తగినంత వైద్య సిబ్బంది లేరని వ్యాఖ్యానించారు. నల్గొండ, నిజామాబాద్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. (కరోనా విషాదం: తల్లి చూస్తుండగానే..)
కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి
కరోనా ఫలితాల వెల్లడిలో ప్రభుత్వం అబద్దాలు చెబుతూ రాష్ర్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూఢనమ్మకాల కోసం సెక్రటేరియట్ కూలగొట్టడం న్యాయమేనా అంటూ ప్రశ్నించిన ఉత్తమ్..కేసీఆర్ తీరు రోమ్ నగరం తగలపడుతుంటే ఫిడేలు వాయించుకున్న చందంగా మారిందన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చి ప్రజలపై భారం భారం పడకుండా వైద్యం అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. కరోనాతో మృతిచెందిన పేదవారికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కరోనా కట్టడిలో ముందుండి నడిపిస్తున్న కరోనా వారియర్స్ వైరస్ కారణంగా మరణిస్తే వారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment