వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యపూరిత వైఖరి కారణంగా రాష్ట్రంలోని ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల యాత్ర చేపట్టిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యే సీతక్కతో కలసి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి గురించి ఆరునెలల క్రితం గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తే కేసీఆర్ తమను దూషించారని, అదే గవర్నర్.. కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రజలకు అండగా కాంగ్రెస్ ఉంటుందని తెలియజేయడంతో పాటు వారికి భరోసా కల్పించేందుకే సీఎల్పీ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రుల పర్యటన కార్యక్రమం చేపట్టామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే లక్షల రూపాయల బిల్లులు భరించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంచకపోవడానికి కారణం ఏంటో ప్రభుత్వం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కరోనా మరణాల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించారు. మండల కేంద్రాల్లో 30 పడకలు, జిల్లా కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రులను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. వైద్య సదుపాయాలు అందుబాటులోలేని గిరిజనుల కోసం హెలికాప్టర్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని 2014లో టీఆర్‌ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 108 వ్యవస్థ పూర్తిగా బలహీన పడిందని, కరోనా కట్టడి విషయంలో పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని అన్నారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
కనీసం ఐసోలేషన్ కేంద్రాలు లేవు
ఏజెన్సీ ఏరియాల్లో కరోనా విజృంభిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం ఐసోలేషన్ సెంటర్స్ లేకపోవడం బాధా కరమని, కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వమే ధరలు నిర్ణయించి పర్యవేక్షించాలని కోరారు. జిల్లాల్లో కరోనా చికిత్స కోసం మినరల్ రిసోర్స్ నిధులు సరిగ్గా వాడుకోవడం లేదని భట్టి విమర్శించారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ప్రజలను కరోనా భయభ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. చికిత్స కోసం పేదలు ఇబ్బందులు పడుతున్నారని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.
యాత్రలో మార్పు
సీఎల్పీ నేత భట్టి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆసుపత్రుల యాత్రలో మార్పు జరిగింది. బుధవారం నుంచి వచ్చే నెల 5 వరకు జరగాల్సిన యాత్ర షెడ్యూల్‌లో మార్పు జరిగిందని, బుధవారం ప్రారంభ మైన ఈ యాత్ర వచ్చే నెల 4వ తేదీ వరకు 10 రోజుల పాటు సాగుతుందని సీఎల్పీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment