సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతి, ప్రభుత్వం చేపట్టిన పనులు.. తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలో భాగంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌కు మంచి స్పందన వస్తుందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ కరోనా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. కరోనా తీవ్రతతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొందని.. ఇప్పటికే లక్ష కు పైగా కరోనా వైరస్ బారినపడి మరణించారని వెల్లడించారు. అమెరికా లాంటి అగ్ర దేశంలో ఒక్క రోజే 1500 పైగా మరణించారని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో ఆ స్థాయిలో కరోనా తీవ్రత లేకపోవడం మన అదృష్టమన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కరోనా అంశాన్ని, దాని తీవ్రతను ఫిబ్రవరి 12న హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టారని దాని ఫలితంగానే నేడు మన దేశం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు.
పార్లమెంట్ లో ఫైనాన్స్ బిల్లు పెట్టిన తర్వాత కేంద్రం లాక్ డౌన్ కి వెళ్ళిందని.. తెలంగాణలో మార్చి 21 న ప్రకటన చేశారు. 22 నుండి లాక్ డౌన్ అమలులోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 21 రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతుందని ఇప్పటి వరకు నిరుపేదలు,కూలీలకు ఎలాంటి సాయం అందడం లేదని ఆయన విమర్శించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలందరికి రూ.1500 ఇస్తామన్నారని.. కానీ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా అందలేదని మండిపడ్డారు. బియ్యం కూడా కేవలం 60 నుంచి 70 శాతం ప్రజలకు మాత్రమే చేరిందన్నారు. ప్రజలకు అందిన సాయంపై సీఎం కేసీఆర్‌కు సమగ్రంగా లేఖ రాస్తామని, సీఎస్‌ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఉత్తమ్‌కుమార్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment