సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాటల్లో అహంకారం.. చేతల్లో విధ్వంసం.. రాజకీయ స్వార్థం కోసం ఎందాకైనా తెగించే తత్వం.. ఇదీ మూడు ముక్కల్లో ప్రతి‘పచ్చ’ పార్టీ వర్గీయుల పరిచయం. జిల్లాలో వీరి స్వార్థ రాజకీయాలకు దేవాలయాలను వేదిక చేసుకున్నారు. విగ్రహ విధ్వంస రాజకీయాలతో విద్వేషాలను ఎగదోసి రాక్షసానందం పొందాలనుకున్నారు. అధికార పార్టీపై అడుగడుగునా బురదజల్లే ప్రయత్నం చేశారు. వాస్తవాలు బయటపడడంతో వీరి కుయుక్తులను చూసి ప్రజలు ఛీ కొట్టారు. అయినా పద్ధతి మార్చుకోలేదు.. పంథా మార్చి శవరాజకీయాలకు తెరలేపారు. వీరి స్వార్థ ప్రయోజనాల కోసం సొంత పార్టీ కార్యకర్తల్నే బలిపశువులుగా మార్చేందుకు సిద్ధమయ్యారనే చర్చ ఆ పార్టీ లో జోరుగా జరుగుతోంది. తాజాగా పలాస నియోజకవర్గంలో జరిగిన టీడీపీ కార్యకర్త ఆత్మహత్య వ్యవహారం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.
చదవండి: చంద్రబాబుది ఆర్థిక అరాచకం
రాజకీయ స్వార్థం కోసం ఎందాకైనా..
ఇటీవల పలాస నియోజకవర్గంలో జరిగిన సంఘటనపై రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘అన్ని రకాలుగా వాడుకుని వాడిని వదిలేద్దాం’ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు గోవిందరావును ఉద్దేశించి చేసిన వ్యంగ్యాస్త్రాలపై ఇప్పటికే ఆ పార్టీ నాయకుల్లో కలకలం రేపింది. తాజాగా మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటరావు ఆత్మహత్యకు అదే పార్టీకి చెందిన నేతల ఉసిగొలిపే ప్రయత్నాలు ఉన్నట్లు ఇప్పుడిప్పుడే ప్రచారం జరుగుతోంది. పలాస నియోజకవర్గంలో రాద్దాంతం సృష్టించి ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో వెంకటరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఆమె పోలీసులపై చేసిన పరుష పదజాలం నివ్వెరపోయాలా చేసింది. అయితే ఈ ఆత్మహత్య వెనుక ఏమైనా రాజకీయ ఎత్తుగడలకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సంచలనంగా ఆడియోలు..
సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నిమ్మాడకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కింజరాపు అప్పన్నను టీడీపీ కార్యకర్త వెంకటరావు తీవ్రంగా బెదిరిస్తూ చేసిన ఆడియోలు ప్రస్తుతం బహిర్గతం కావడం సంచలనంగా మారింది. పోలీసుల బెదిరింపుల వల్లే వెంకటరావు మనస్తా పానికి గురై ఆత్యహత్యకు పాల్పడ్డాడు అనేది టీడీపీ నాయకుల వాదన. అచ్చెన్నాయుడు జోలికి వస్తే కాళ్లు నరికేస్తా.. చంపేస్తానంటూ నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి... మనస్తాపానికి ఎలా గురి కాగలడు అనే సందేహం స్థానికంగా వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో వెంకటరావు ప్రవర్తన తెలుసుకునేందుకు వెళ్లిన పోలీసులను బెదిరించే క్రమంలో చేసిన ఆత్మహత్య ప్రయత్నంలో అదే పార్టీకి చెందిన నేతల ఉసిగొలిపే కుట్ర ఉందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాజకీయ లబ్ధి కోసం సొంత పార్టీకి చెందిన కార్యకర్తనే బలిగొన్నారంటూ అదే పార్టీకి చెందిన ఓ వర్గం నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. జిల్లాలో టీడీపీ పట్టు సాధించేందుకు కార్యకర్తలను స్వార్థం కోసం వినియోగించుకోవడంపై మండిపడుతున్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు సొంత పార్టీ కార్యకర్తలనే బలి చేస్తారా.. అంటూ స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment