బద్వేల్‌.. ఓ బలిపీఠం.. వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు | Tdp Political Victims In Badvel Kadapa District | Sakshi
Sakshi News home page

బద్వేల్‌.. ఓ బలిపీఠం.. వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు

Published Sun, Jan 14 2024 11:36 AM | Last Updated on Fri, Jan 26 2024 1:19 PM

Tdp Political Victims In Badvel Kadapa District - Sakshi

అమృత్‌కుమార్‌, రాజశేఖర్‌, ఎన్‌.డి.విజయజ్యోతి, జయరాములు

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బలిపీఠంగా మారింది. ఉన్నత ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారంతా క్రమేపీ తెరమరుగయ్యారు. అటు ఉద్యోగానికి దూరమై, ఇటు స్థానిక నాయకత్వాన్ని మెప్పించలేక రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ఆయా అభ్యర్థుల పట్ల అధినేత  చంద్రబాబు సైతం ఆదరణ చూపకపోగా..వారిని కరివేపాకు చందంగా అవసరానికి వాడుకొని వదిలేశారు.

ఇప్పటి­వరకు ముగ్గురికి ప్రత్యక్షంగా ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బద్వేల్‌ నియోజకవర్గంలో దివంగత నేత బిజివేముల వీరారెడ్డిదే ఆధిపత్యం. ఆయన మరణానంతరం 2001 ఉప ఎన్నికల్లో వీరారెడ్డి కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అరంగేట్రంతోనే విజయం సాధించారు.

అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీదే హవా సాగింది. అనంతరం వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ­మయ్యాక..మరో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. 2009లో బద్వేల్‌ ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థికి మరోమారు అవకాశం లేకుండా స్థానిక నాయకత్వం మోకాలడ్డుతోంది. 

అమృత్‌కుమార్‌ నుంచి డాక్టర్‌ రాజశేఖర్‌ వరకూ..
అధ్యాపకునిగా స్థిరపడిన లక్కినేని అమృత్‌కుమార్‌ (చెన్నయ్య) 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా..ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2014 ఎన్నికల నాటికి లక్కినేని పార్టీలో కనుమరు­గయ్యారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న ఎన్‌డీ విజయజ్యోతి 2014 టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల నాటికి విజయజ్యోతిని కూడా తెరమరుగు చేశారు. అప్పట్లో ప్రభుత్వ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓబులాపురం రాజశేఖర్‌కు అవకాశం కల్పించారు.

2024 ఎన్నికల నాటికి డాక్టర్‌ రాజశేఖర్‌ రాజకీయ ప్రస్థానమూ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్నను తెరపైకి తీసుకువచ్చారు. బొజ్జాతో ఉద్యోగానికి రాజీనామా చేయించి టీడీపీ అభ్యర్థిగా శ్రేణులకు పరిచయం చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరిని అవసరానికి వాడుకొని వదిలేస్తుండటం రివాజుగా మారిపోయింది. 

బాబుది సైతం అదే ధోరణి.
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబానిదే టీడీపీలో ఆధిపత్యం. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా విజయమ్మ మెప్పు లేకపోతే, ఆయా అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకమే అన్నట్లు తలపిస్తోంది. లక్కినేని చెన్నయ్యతో మొదలు డాక్టర్‌ రాజశేఖర్‌ వరకూ చోటుచేసుకున్న పరిస్థితే ఇందుకు ఉదాహరణ. ఉన్నత ఉద్యోగాలను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు కూడా అలాంటి ధోరణినే అవలంబిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై 2021లో చంద్రబాబును నమ్మి పార్టీ తీర్థం పుచ్చుకున్న అప్పటి ఎమ్మెల్యే తిరువీధి జయరాములు కూడా తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే బద్వేల్‌ టీడీపీ అభ్యర్థుల పాలిట బలిపీఠంగా మారందని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement