'తీసుకున్న ప్యాకెట్లలో ఏముందో చెప్పాలి'
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ బహరోచ్ లో ఆక్రోశ్ ర్యాలీలో పాల్గొన్న ఆయన గురువారం ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తన సంధించిన ప్రశ్నలకు ప్రధాని ఇప్పటివరకూ సమాధానం చెప్పలేదని రాహుల్ మండిపడ్డారు. 2012, 2013 సంవత్సరాల్లో తీసుకున్న ప్యాకెట్లలో ఏముందో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
అవినీతికి పాల్పడ్డారా లేదా అనే దానికి ప్రధాని సూటిగా సమాధానం ఇవ్వాలని రాహుల్ అన్నారు. తనను వేళాకోళం చేసినా ఫరవాలేదని, ప్రజలకు నిజం తెలియాలన్న ఆయన... మోదీ సర్కార్ చేస్తున్నది అవినీతి వ్యతిరేక పోరాటం కాదని, ఇది పేదవాళ్లపై వ్యతిరేక పోరాటమేనని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తూ...సామాన్యులను మాత్రం క్యూలైన్‌లో నిలబెడుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. క్యూలైన్‌లలో నిలబడ్డవారంతా అవినీతిపరులు కాదని, పారిశ్రామిక్తవేత్తల రుణాలను రద్దు చేస్తున్న ప్రధాని...రైతుల రుణాలను మాత్రం రద్దు చేయడం లేదని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలపై తాము ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ... వాటి గురించి ఇప్పటివరకూ చిన్నముక్క కూడా మాట్లాడలేదని రాహుల్ విమర్శించారు. (రాహుల్ గాంధీ 'భూకంపం'పై మోదీ కౌంటర్)