‘భోజనం’ భారం
‘భోజనం’ భారం
Published Mon, Jun 19 2017 12:31 AM | Last Updated on Wed, Apr 3 2019 9:29 PM
- మండుతున్న ధరలతో ఏజెన్సీల నిర్వాహకుల బెంబేలు
ధర్మవరం : నలుగురున్న కుటుంబం కూడా కూరగాయలు కొనాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో విద్యార్థులందరికీ కూరలు వండి పెట్టడం మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారుతోంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. దీంతోపాటు మధ్యాహ్న భోజన పథకం కూడా మొదలైంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులు ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ఏ కూరగాయలు కొందామన్నా కిలో రూ.30 నుంచి రూ.50కి తక్కువ కాకుండా ఉన్నాయి. మిర్చి కిలో రూ.70 పలుకుతోంది. సరుకుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అంతంత ధరలు పెట్టి కొని సగటున 50 నుంచి 100 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టాలంటే ఏజెన్సీల నిర్వాహకులకు భారమవుతోంది. అదే ఉన్నత పాఠశాలల్లో అయితే ఈ భారం మరింత ఎక్కువగా ఉంది. అక్కడ కనీసం 500 మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పెంచిన ధరలు(1 - 5 వ తరగతి వరకు రూ.6.30 పైసలు, 6 - 10వ తరగతి వరకు రూ.8.13 పైసలు) సరిపోవడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు.
రూ.లక్షల్లో గతేడాది బకాయిలు
గత ఏడాది మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించిన వేతనాలు, బిల్లులు ప్రభుత్వం ఇప్పటిదాకా చెల్లించలేదు. 2017 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన బిల్లులు, వేతనాలు చెల్లించాల్సి ఉంది. సగటున వందమంది విద్యార్థులకు భోజనం అందిస్తున్న ఏజెన్సీకి నెలకు రూ.15 వేల దాకా బిల్లులు అందాల్సి ఉంది. మూడు నెలలకు కలిపి రూ.45 వేలు చొప్పున రావాలి. అవి అందకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు భోజనం పెట్టేందుకు డబ్బులు వడ్డీలకు తెస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 3,043 ప్రాథమిక, 1,003 ప్రాథమికోన్నత, 988 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 5,034 పాఠశాలల్లో 5,61,495 విద్యార్థులు చదువుతున్నారు. 5034 ఏజెన్సీల æద్వారా మొత్తం విద్యార్థులకు రోజూ అన్నం పెడుతున్నారు. ఇందుకుగానూ ఆయా ఏజెన్సీలకు నెలకు రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన గత ఏడాది బిల్లులే రూ.21 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
మధ్యాహ్న భోజన పథకం మెనూ
సోమ, గురువారం : అన్నం +కూరగాయలతో కూడిన సాంబారు
మంగళవారం, శుక్రవారం : ఏదైనా ఒక కూర+రసం
బుధవారం, శనివారం : పప్పు, ఆకు కూర పప్పు
దీంతోపాటు వారానికి మూడురోజులు(రేట్లు పెంచిన తర్వాత పెంచారు) కోడిగుడ్డు ఇవ్వాలి
Advertisement