-
శాస్త్రీయ లెక్కలు నిర్థారిస్తున్నా బుకాయింపులే
-
మన్యంలో మలేరియా లేదని మంత్రి కామినేని ప్రకటన
-
పచ్చని పల్లెలు జ్వరాలతో వణుకున్నాయి
-
పసిమొగ్గలపై పంజా విసురుతున్న జ్వరాలు
తీవ్రత లెక్క ఇదీ...
- స్లైడ్ పాజిటివ్ రేట్ (ఎస్‌పీఆర్) 2 దాటితే మలేరియా తీవ్రత ఎక్కువైందని భావించవచ్చు.
- ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 13 పీహెచ్‌సీల పరిధిలో ఎస్‌పీఆర్ స్థాయి రెండుకంటే ఎక్కువగా నమోదైంది.
- ఏడుగురాళ్ల పల్లి పీహెచ్‌సీ పరిధిలో ఎస్‌పీఆర్ 9.8గా నమోదైంది.
- మంగంపాడు పీహెచ్‌సీలో 8.3, గౌరిదేవీపేట 4.1, బోదులూరు 3.6, తులసిపాకలు 3.8గా నమోదయింది.
- ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రక్త పూతలు సేకరిస్తే 3,265 మందికి మలేరియా జ్వరాలు ఉన్నట్లు నిర్ధారణయింది.
.
రంపచోడవరం: ఏజెన్సీ గ్రామాలు జ్వరాలతో వణుకున్నాయి. హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా జ్వరాలు బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. తాజాగా వాడపల్లి గ్రామానికి చెందిన రెండో తరగతి చదువుతున్న కోట చినబాబుదొర (6) అనే విద్యార్థి జ్వరంతో మృతి చెందాడు. గుర్తేడు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న చంద్రరెడ్డి అనే మరో విద్యార్థి అనారోగ్యంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి కాకినాడ రిఫర్ చేశారు. మన్యంలో విష జ్వరాలు, మలేరియా గిరిజనులను కుదిపేస్తుంటే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఏజెన్సీలో అసలు మలేరియా మరణాలు సంభవించలేదని చెప్పడం విశేషం. స్థానిక ఏరియా ఆసుపత్రిలో పసిపాపలు జ్వరాలు బారిన పడి చికిత్స పొందుతున్నా బుకాయింపులకు దిగడం పట్ల సంబంధిత వైద్య సిబ్బందే ముక్కున వేలేసుకుంటున్నారు.
.
మన్యంలో ప్రమాద ఘంటికలు...
మన్యంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జ్వరాల కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. స్లైడ్ పాజిటివ్ రేట్ (ఎస్‌పీఆర్) 2 దాటితే ఆయా పీహెచ్‌పీ పరిధిలోని గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువైందని భావించవచ్చు. ఏజెన్సీలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 13 పీహెచ్‌సీల పరిధిలో ఎస్‌పీఆర్ స్థాయి రెండుకంటే ఎక్కువగా నమోదయింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఎస్‌పీఆర్ ప్రమాదకర రీతుల్లో నమోదవుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా మంత్రివర్యులు మాత్రం అసలు మలేరియా కేసులే లేవనడం విడ్డూరంగా ఉంది. ఏడుగురాళ్ల పల్లి పీహెచ్‌సీ పరిధిలో ఎస్‌పీఆర్ 9.8గా నమోదైంది. మంగంపాడు పీహెచ్‌సీలో 8.3, గౌరిదేవీపేట 4.1, బోదులూరు 3.6, తులసిపాకలు 3.8గా నమోదయింది. ఎస్‌పీఆర్ 2 దాటిన గ్రామాలను హైరిస్క్ గ్రామాలుగా గుర్తించి మలేరియా నివారణకు పటిష్టమైన చర్యలు తీసకోవాలి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 1,39,622 మంది జ్వర పీడితుల నుంచి రక్త పూతలు సేకరిస్తే 3,265 మందికి మలేరియా జ్వరాలు ఉన్నట్లు నిర్ధారణయింది.
.
పాసిమొగ్గలపై జ్వరాలు పంజా...
ఏజెన్సీలో అనారోగ్య పరిస్ధితుల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ గ్రామల్లో ౖౖవైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ నెల 4వ తేదీ నుంచి పది రోజులుపాటు నిర్వహించిన ఈ శిబిరాల్లో 4 వేల మందికి జ్వరాలు ఉన్నట్లు నిర్థారణ చేశారు. అలాగే వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 200 మందిపైనే జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో నెలలులోపు చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ సక్రమంగా జరగకపోవడంతో దోమలు సంఖ్య పెరిగిపోయింది. నిల్వ నీటిలో సకాలంలో స్ప్రేయింగ్ జరగకపోవడం దోమ లార్వాలు అభివృద్ధికి దోహదం చేసింది. అలాగే దోమల నివారణకు పిచికారీ చేసే మందు సకాలంలో సరఫరా కాకపోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు.