శై.. శవాలు
శై.. శవాలు
Published Tue, Dec 6 2016 11:58 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
జగనన్నా...!
ఏమీ ఎరుగుని పూవులం...ఏడాది కూడా నిండని పాపలం
ఆకాశంలో...మెరుపు, వాన, హరివిల్లుల ఆనందమే తెలియని నిర్భాగ్యులం... అచటికెచటకో, ఎచటికెచటకో...తేనీగల్లా ఎగిరే పిల్లలమే...
పిట్టల్లా...ఉడతల్లా ఊరంతా మాదేననే బాల్యమే
కానీ...పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా
నీరసించిపోతున్న పసికూనలంగరిక పచ్చ మైదానాల్లో, తామర పూవుల కొలనుల్లో పంట చేలల్లో ... బొమ్మరిళ్లల్లో తండ్రి సందిట, తల్లి కౌగిల్లో
బాసట పొందాలని ఉన్నా... పుట్టెడు బాధల మధ్య గరిటెడు పాలకూ దిక్కులేక గుక్కపెట్టి ఏడుస్తూ...కన్నుమూస్తున్నాం..చావుబాట పడుతున్న శై...శవాలమవుతున్నాం...
65 రోజుల్లో 13 మంది నవజాత శిశుమరణాలు ∙
పొత్తిళ్లలోనే కన్నుమూస్తున్న చిన్నారులు
రక్తహీనతతో చనిపోతున్న పిల్లలు ∙
నేడు, రేపు తూర్పు మన్యంలో ‘జననేత’ జగన్ పర్యటన
నవమాసాలు మోసి.. కన్న బిడ్డలు తల్లిపొత్తిళ్లలోనే కన్నుమూస్తున్నారు. ఆ తల్లుల ముద్దూముచ్చట తీరకుండానే వారికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. ఆర్థిక లేమి.. అధికార యంత్రాంగం అలసత్వం.. పౌష్టికాహార లోపం.. ఇలా ఎన్నో కారణాలతో మన్యంలో శిశుమరణాలు అధికమవుతున్నాయి. ఆదివాసీలను అంతులేని వ్యధకు గురిచేస్తున్నాయి. గిరిజన సంక్షేమానికి ఏజెన్సీలో రెండు ఐటీడీఏలు పనిచేస్తున్నా చిన్నారుల మరణాలు అడ్డుకోలేని దుస్థితి. రాజవొమ్మంగి మండలంలోని గిరిజన గ్రామాల్లో ఇప్పటి వరకు 13 మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారంటే అక్కడ పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రక్తహీనత ప్రధాన కారణం
గిరిజన మహిళల్లో రక్తహీనత వారి ప్రాణాలు, పుట్టిన బిడ్డలపై ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు జడ్డంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో దాదాపు 170 మంది గర్భిణులకు 50 మంది రక్తహీనత తదితర సమస్యలతో హైరిస్క్‌లో ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలోని రాజవొమ్మంగి, లాగరాయి పీహెచ్‌సీల్లోనూ ఉంది. హైరిస్క్‌లో ఉన్న గర్భిణులను రాజవొమ్మంగి, జడ్డంగి, లాగరాయి పీహెచ్‌సీల నుంచి వైద్యులు కాకినాడ రిఫర్ చేస్తున్నారు. అక్కడ వారికి పేరుకు ఒకటి రెండు రక్తం బాటిల్స్ ఎక్కించి ఆ తరువాత వారి ఆరోగ్య పరిస్థితిపై ఏమార్చుతున్నారు. క్షేత్రస్థాయిలో గల ఆరోగ్య ఉపకేంద్రాలు వీరికి అక్కరకు రావడం లేదు.
శీతాకాలంలోనే మరణాలు అధికం
మన్యంలో శీతాకాలం ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి 12, 13 డిగ్రీల కనిష్టస్థాయికి పడిపోవడం కూడా పిల్లలకు శాపంగా మారుతోంది. ఆదివాసీలకు ఊలు బట్టలు, చుట్టూ గోడలు లేక చలి బారిన పడుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలకు, బాలింతలకు చలినుంచి ఉపశమనం లేక అల్లాడుతున్నారు.
పనిచేయని పౌష్టికాహార కేంద్రాలు
ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఆధ్వర్యంలో ఏజెన్సీ 11 మండలాల్లో 342 పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏజెన్సీలో ఎక్కడ ఈ కేంద్రాలు పనిచేయడం లేదు. నిధుల కొరతతో మూతపడ్డాయి. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఆరు నెలల నుంచి ఆరేళ్లవయస్సు గల పిల్లలు 21,351 మంది ఉన్నారు. వీరిలో 20శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
గైనిక్ సేవలు నిల్
ఏజెన్సీలో గర్భిణులకు గైనకాలజిస్ట్ సేవలు అందడం లేదు. ఏజెన్సీకి ప్రధాన ఆసుపత్రి రంపచోడవరంలో కూడా గైనకాలజిస్ట్ పోస్టును ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదు. 24 గంటల పీహెచ్‌సీల్లో కూడా వైద్యులు అందుబాటులో లేరు. పీహెచ్‌సీలకు వాహనాలు లేకపోవడంతో తక్షణం ఏరియా ఆసుపత్రికి తరలించే అవకాశం లేకుండా పోతోంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు ఆర్‌ఎంపీలను సంప్రదిస్తున్నారు. ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.చిన్నారులు విషయంలోనూ ఇదే జరుగుతోంది.
మౌళిక వసతుల లేమితో పోతున్న ప్రాణాలు
రాజవొమ్మంగి మండలం బూరుగపల్లి గ్రామంలో పప్పుల రామలక్ష్మి, పొత్తూరి లోవకుమారిలు పండంటి మగ బిడ్డలకు జన్మనిచ్చారు. రెండురోజులు రాజవొమ్మంగి ఆసుపత్రిలోని బర్త్‌వెయిటింగ్ రూంలో ఉన్నారు. ఆ రూంలోకి వర్షం పడుతోందని వారిని వైద్యులు ఇంటికి పంపేశారు. ఇంటికి వచ్చిన పప్పుల రామలక్ష్మి బిడ్డ ఇంటి వద్దనే చనిపోయాడు. రెండు నెలలు ఆరోగ్యంగానే ఉన్న లోవకుమారి బిడ్డ ఊపిరి అందక, అస్వస్థతకు గురికావడంతో రహదారి సరిగా లేని ఆ గ్రామం నుంచి అతికష్టంతో జడ్డంగి పీహెసీకి తరలించారు. వైద్యులు ఆ శిశువును కాకినాడ రిఫర్ చేయగా మరో రోజు వెళ్లవచ్చని ఇంటికి వచ్చిన ఆ తల్లికి బిడ్డ ప్రాణం
దక్కలేదు.
Advertisement
Advertisement