సత్తుపల్లి/సత్తుపల్లిటౌన్: పుట్టినరోజే ఆ చిన్నారికి చివరి రోజు అయింది. పాఠశాలలో చాక్లెట్లు ఇచ్చి వస్తుండగా ఆరో తరగతి బాలిక చెట్టు కొమ్మ విరిగిపడటంతో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటుచేసుకుంది. సత్తుపల్లికి చెందిన కాళ్లకూరి అశోక్ ఆరేళ్ల క్రితం మృతి చెందగా ఆయన భార్య జ్యోత్స్న హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన 11ఏళ్ల కుమార్తె లిఖిత సంతోషిని తల్లిదండ్రుల వద్ద ఉంచి చదివిస్తోంది. శుక్రవారం లిఖిత పుట్టినరోజు కావడంతో తాత పూర్ణచందర్‌రావు, లిఖిత చిన్నమ్మ కుమార్తె దేవికా సాయి (ఎల్‌కేజీ)తో కలిసి ద్విచక్ర వాహనంపై గంగారంలోని పాఠశాలకు వెళ్లి స్నేహితులు, ఉపాధ్యాయులకు చాకెట్లు ఇచ్చి బయలుదేరారు.
చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే టార్గెట్.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో..
సత్తుపల్లికి వస్తుండగా మార్గమధ్యలో తాళ్లమడ పరుపుల ఫ్యాక్టరీ సమీపాన ఎండిపోయిన చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి వాహనంపై ఉన్న లిఖిత తలపై పడింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.ఆటోలో సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్‌లో ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. లిఖిత కింద పడి తలకు తీవ్ర రక్తస్రావం అవుతుండగా తాత తన ఒడిలో పెట్టుకుని ‘అమ్మా తల్లి.. లే బిడ్డా.. ఎంత దెబ్బ తగిలిందో.. అయ్యో ఎంత రక్తం పోయిందో.. ఇవాళ నీ పుట్టినరోజు లెగమ్మా.. అంటూ రోదించాడు. ఆమె చిన్నమ్మ బాల ‘బర్త్‌డే గిఫ్ట్ తెచ్చాను.. లెగమ్మా..’ అంటూ చేసున్న రోదనలు విషాదాన్ని నింపాయి.
అధికారుల నిర్లక్ష్యంతోనే...
ఖమ్మం–అశ్వారావుపేట జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఎండిపోయిన చెట్లు ప్రమాదకరంగా మారాయి. దీనిపై ‘విరిగి పడితే ప్రమాదమే’శీర్షికన ‘సాక్షి’గతంలో కథనం ప్రచురించింది. కూసుమంచి ప్రాంతంలో చెట్టు విరి గిపడి ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇదే విషయమై ఇటీవల జరిగిన పల్లె ప్రగతి సమీక్షలో అధికారులు కలెక్టర్ వీపీ గౌతమ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎండిపోయిన చెట్లను గుర్తించి ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో తొలగించాలని ఆయన ఆదేశించడంతో కొన్నిచోట్ల తొలగించినా మరికొన్ని చోట్ల వదిలేశారు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు 11 ఏళ్ల చిన్నారిని బలిగొంది.
Comments
Please login to add a commentAdd a comment