Tree branch
-
పుట్టినరోజునే.. అనంత లోకాలకు.. స్కూల్లో చాక్లెట్లు పంచి వస్తుండగా..
సత్తుపల్లి/సత్తుపల్లిటౌన్: పుట్టినరోజే ఆ చిన్నారికి చివరి రోజు అయింది. పాఠశాలలో చాక్లెట్లు ఇచ్చి వస్తుండగా ఆరో తరగతి బాలిక చెట్టు కొమ్మ విరిగిపడటంతో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటుచేసుకుంది. సత్తుపల్లికి చెందిన కాళ్లకూరి అశోక్ ఆరేళ్ల క్రితం మృతి చెందగా ఆయన భార్య జ్యోత్స్న హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన 11ఏళ్ల కుమార్తె లిఖిత సంతోషిని తల్లిదండ్రుల వద్ద ఉంచి చదివిస్తోంది. శుక్రవారం లిఖిత పుట్టినరోజు కావడంతో తాత పూర్ణచందర్రావు, లిఖిత చిన్నమ్మ కుమార్తె దేవికా సాయి (ఎల్కేజీ)తో కలిసి ద్విచక్ర వాహనంపై గంగారంలోని పాఠశాలకు వెళ్లి స్నేహితులు, ఉపాధ్యాయులకు చాకెట్లు ఇచ్చి బయలుదేరారు. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో.. సత్తుపల్లికి వస్తుండగా మార్గమధ్యలో తాళ్లమడ పరుపుల ఫ్యాక్టరీ సమీపాన ఎండిపోయిన చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి వాహనంపై ఉన్న లిఖిత తలపై పడింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.ఆటోలో సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్‌లో ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. లిఖిత కింద పడి తలకు తీవ్ర రక్తస్రావం అవుతుండగా తాత తన ఒడిలో పెట్టుకుని ‘అమ్మా తల్లి.. లే బిడ్డా.. ఎంత దెబ్బ తగిలిందో.. అయ్యో ఎంత రక్తం పోయిందో.. ఇవాళ నీ పుట్టినరోజు లెగమ్మా.. అంటూ రోదించాడు. ఆమె చిన్నమ్మ బాల ‘బర్త్‌డే గిఫ్ట్ తెచ్చాను.. లెగమ్మా..’ అంటూ చేసున్న రోదనలు విషాదాన్ని నింపాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే... ఖమ్మం–అశ్వారావుపేట జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఎండిపోయిన చెట్లు ప్రమాదకరంగా మారాయి. దీనిపై ‘విరిగి పడితే ప్రమాదమే’శీర్షికన ‘సాక్షి’గతంలో కథనం ప్రచురించింది. కూసుమంచి ప్రాంతంలో చెట్టు విరి గిపడి ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇదే విషయమై ఇటీవల జరిగిన పల్లె ప్రగతి సమీక్షలో అధికారులు కలెక్టర్ వీపీ గౌతమ్ దృష్టికి తీసుకొచ్చారు. ఎండిపోయిన చెట్లను గుర్తించి ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో తొలగించాలని ఆయన ఆదేశించడంతో కొన్నిచోట్ల తొలగించినా మరికొన్ని చోట్ల వదిలేశారు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు 11 ఏళ్ల చిన్నారిని బలిగొంది. -
‘తగ్గేదేలే..’ అంటున్న ఏజెన్సీవాసులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే!’ అంటూ ఫారెస్టు అధికారుల కళ్లు కప్పి ఎర్ర చందనం దుంగలను నీటి ప్రవాహంలో విడిచి, డ్యామ్ దగ్గర సేకరించే సినిమా సీన్‌కు ప్రేక్షకులు సీటీలు కొట్టారు. అయితే స్మగ్లింగ్‌తో సంబంధం లేకుండా గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ వాసులు కూడా ‘తగ్గేదేలే..’ అంటూ సాహసాలు చేస్తుంటారు. వర్షానికి నేల కూలిన భారీ చెట్లు, అడవుల్లో ఎప్పుడో పడిపోయి ఎండిపోయిన చెట్లదుంగలు వరదనీటిలో కొట్టుకొస్తుంటాయి. స్మగ్లర్లు దాచిపెట్టిన కలప దుంగలు కూడా అప్పుడప్పుడు ప్రవాహంలో కలుస్తుంటాయి. ఇచ్చంపల్లి దగ్గర ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత ఇలాంటి దుంగలు కొట్టుకొస్తాయి. ఆ కలపకోసం ఏజెన్సీవాసులు ప్రాణాలకు తెగించి మరబోట్లపై వెళ్తున్నారు. కొట్టుకొచ్చే దుంగలను పట్టుకుని బోటులో వేయడమో లేదా తాడుకు కట్టో ఒడ్డుకు చేరుస్తారు. వరద సమయంలో చర్ల మొదలు రాజమహేంద్రవరం వరకు ఈ తరహా దృశ్యాలు కనిపిస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో మంగళవారం కలప కోసం, సుమారు 52 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్న గోదావరిలో కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ కనిపించారు. టేకు దుంగలు అరుదుగా కొట్టుకొస్తాయని చెబుతున్నారు. -
4వ అంతస్తు నుంచి కిందపడ్డ చిన్నారి..
ప్రాణం పోయే పరిస్థితుల్లో నుంచి బయటపడితే ఏమంటాం.. అద్భుతమే జరిగింది. భూమ్మీద నూకలు బాకీ ఉన్నాయి అంటాం. చిన్న పిల్లల విషయంలోనైతే చిరంజీవి అంటాం. ముంబైకి చెందిన అధర్వాను ఇప్పుడందరూ చిరంజీవి అని పిలుచుకుంటున్నారు. పిల్లాడికి తిరిగి జీవితాన్ని ప్రసాదించిన ఆ చెట్టును సంజీవని అంటున్నారు. సాక్షి, ముంబై : నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడ్డ 14 నెలల అధర్వా బర్కాడే అలియాస్ శ్రీ అనే బాలుడికి ఓ చెట్టు పునర్జన్మనిచ్చింది. చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేలా చేసింది. వివరాలు.. అధర్వా అలియాస్ శ్రీ కుటుంబం గోవంధిలోని దేవాశి రోడ్డులో గల గోపికృష్ణన్ అపార్ట్మెంట్లో నివాసముంటోంది. గురువారం ఉదయం శ్రీ నానమ్మ ఫ్రెంచ్ కిటీకీ తెరచి బట్టలు ఆరబెట్టింది.కానీ, హడావుడిలో గడియ సరిగా పెట్టలేదు. కొత్త భవనం కావడంతో దానికి గ్రిల్స్ బిగించలేదు. అదే గదిలో ఆడుకుంటున్న శ్రీ కిటికీ వద్దకు చేరుకున్నాడు. రక్షణగా ఉన్న రెండు ఫీట్ల ఎత్తున్న తేలికపాటి చెక్కను తొలగించడంతో ఆ ఫ్రెంచ్ కిటికీ నుంచి నుంచి కిందపడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. పరుగు పరుగున కిందకి చేరుకున్నారు. అయితే, శ్రీ కుటుంబం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను ఆనుకుని ఓ చెట్టు ఉండడంతో.. పిల్లాడు నేరుగా కిందపడలేదు. ఆ చెట్టు కొమ్మలపై పడి నేలను చేరడంతో తీవ్ర గాయాలు కాలేదు. తమ కుమారుడికి ఏమైందోనని తల్లిదండ్రులు అజిత్, జ్యోతి వచ్చి భోరున విలపించారు. బాలుడు స్పృహలోనే ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శ్రీకి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. పెదవి, కాలికి గాయాలయ్యాయని తెలిపారు. చెట్టుపై పడడంతోనే పిల్లాడికి పెద్దగా గాయాలు కాలేదని అన్నారు. కాగా, బాలుడి తండ్రి చెట్ల పెంపకానికి వినియోగించే ఎరువులు, మట్టి, పేడ వ్యాపారం చేస్తుండడం విశేషం. పిల్లాడి ప్రాణాలు కాపాడిన ఆ చెట్టుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. -
స్కూల్లో చెట్టు తొలగింపు.. రోడ్డున వెళ్లే వ్యక్తి మృతి
సాక్షి, పాలకొల్లు: ఎక్కడున్నా మృత్యువు కబళిస్తుందంటారు.. ఎవరో చెట్టు తొలగిస్తుంటే రోడ్డున వెళ్తున్న వ్యక్తిపై అది పడి మృతిచెందాడు. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని శివదేవుని చిక్కాల గ్రామంలో జెడ్పీ హైస్కూల్ ఉంది. దాని ఆవరణలో ఉన్న ఓ భారీ చెట్టుపై కొందరి కళ్లుపడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాన్ని అనధికారికంగా తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో స్కూలు ముందునుంచి జాతీయ రహదారిపై వెళ్తున్న రావూరి రాము(24) అనే చిరు వ్యాపారిపై చెట్టు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వీరవాసరం గ్రామానికి చెందిన రాము పూలపల్లి బైపాస్ రోడ్డులో కూరగాయల వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. -
ఈ పల్లె... పక్షుల స్వర్గం!
ఒక ఉదయాన... కిటికీ నుంచి తొంగి చూస్తున్నప్పుడు... చెట్టు కొమ్మ మీద పిట్ట పాట వినక ఎన్ని రోజులవుతుందో! ఒక సాయంత్రాన... ఆకాశ దేశాన బారులు బారులుగా ప్రయాణించే పక్షుల గుంపును చూసి ఎన్ని రోజులవుతుందో! మాయమైపోతుంది. మనిషిలోని మనిషి మాత్రమే కాదు... పక్షుల జాడ కూడా! అందుకే ఆ పక్షులను తన గుండెల్లో పెట్టుకోవాలనుకుంది కొక్కరేబేలూర్. కర్ణాటక రాష్ట్రంలోని మద్దూరు తాలూకాలో ఉన్న ఈ చిన్న ఊళ్లోకి అడుగుపెడితే... చెట్లకు వేలాడే పక్షిగూళ్లు స్వాగతతోరణాల్లాగ కనిపిస్తాయి. పక్షులను ప్రేమించమని మౌనంగా చెబుతాయి. ప్రతి చెట్టుకూ పక్షి గూళ్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఇక మే నెలలోనైతే చిట్టి చిట్టి పక్షి పిల్లలతో వాతావరణం అల్లరి అల్లరిగా ఉంటుంది. పక్షులను పక్షుల్లా కాకుండా తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. పక్షులు కూడా గ్రామస్థులకు బాగా అలవాటుపడిపోయాయి. వాటికి ఎంత దగ్గరికి వెళ్లినా, భయంతో పారిపోకుండా కళ్లలో కళ్లు పెట్టి ప్రేమగా చూస్తాయి. ఆ గ్రామానికి వచ్చే ప్రధాన పక్షుల్లో పెలికాన్, బ్లాక్ ఐబిస్, గ్రే హెరాన్, ఇండియన్ పాండ్ హెరాన్ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. సెప్టెంబర్‌లో గ్రామంలోకి ప్రవేశించే పక్షులు మే తరువాత వేరే చోటుకి వలస వెళతాయి. ఎక్కడెక్కడి నుంచో తమ గ్రామానికి వలస వచ్చే ఈ పక్షులను కేవలం అతిథులుగా మాత్రమే కాకుండా తమ అదృష్టంగా కూడా భావిస్తారు ఆ గ్రామస్థులు. చెట్ల మీద నివాసముండే పక్షులు అప్పుడప్పుడూ దగ్గరలోని పంటపొలాలపై వాలి తమ ఆకలిని తీర్చుకుంటాయి. దీనివల్ల నష్టం వాటిల్లినా... వాటిని తరిమికొట్టడం, హింసాత్మక చర్యలకు దిగడంలాంటివేమీ చేయరు గ్రామస్థులు. పక్షులపై వారి ప్రేమను ప్రభుత్వం సైతం అర్థం చేసుకుంది. అందుకే పక్షుల కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తుంది. ‘‘ఈ పక్షులను చూస్తుంటే సొంత బిడ్డల్ని చూసినట్లుగా అనిపిస్తుంది’’ అంటుంది గ్రామానికి చెందిన ఒక గృహిణి. కొందరైతే చనిపోయిన తమ ఆత్మీయులను ఈ పక్షుల్లో చూసుకుంటా మని చెబుతున్నారు. ‘‘మీది ఏ ఊరు? అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే, మా ఊరు పేరు చెబితే రాష్ట్రంలో గుర్తు పట్టనివారు ఉండరు. పైగా మా ఊరి ఔన్నత్యం గురించి పొగుడుతుంటారు కూడా’’ అంటాడు గ్రామానికి చెందిన కుమార్ అనే విద్యార్థి. ‘‘ఆడపిల్ల ప్రసవానికి పుట్టింటికి వెళ్లినట్లు ఈ పక్షులు మా ఊరికి వస్తాయి’’ అని గర్వంగా చెబుతాడు యోగేశ్ అనే యువకుడు. కొక్కరేబేలూర్ చేస్తున్న పుణ్యం ఊరకే పోలేదు. రాష్ట్రంలో ఎన్నో గ్రామాలకు ఈ గ్రామం ‘రోల్ మోడల్’గా మారింది. ప్రభుత్వం కూడా పక్షుల సంక్షేమానికి ప్రత్యేకంగా గ్రాంటు విడుదల చేస్తోంది. పక్షులను వాటి మానాన వాటిని వదిలేయడం కాకుండా వాటి ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తుంటారు గ్రామస్థులు. ఏదైనా పక్షి అనారోగ్యంతో కనిపించినా, గాయపడినా తక్షణ వైద్య సహాయం అందిస్తారు. కొందరైతే చేపపిల్లలను ప్రేమగా పక్షుల నోటికి అందిస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ ఊరు దాటిన తరువాత ఒక్క చెట్టు మీద కూడా పక్షుల గూళ్లు కనిపించవు. దీన్ని బట్టి పక్షులకు, ఆ ఊరికి ఉన్న అనుబంధం ఏపాటిదో అర్థమవుతుంది. ‘‘పక్షులు ఈ ఊరికి ఎప్పటి నుంచి రావడం మొదలైంది? ఈ ఊరికే ఎందుకు రావడం మొదలైంది?’’లాంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలేవీ దొరకక పోవచ్చు. కాని వాటి గురించి అందరూ చెప్పే సమాధానం ఒక్కటే- ‘‘పక్షులు కొలువైన చోట ఊరికి మంచి జరుగుతుంది’’ అని!