ఈ పల్లె... పక్షుల స్వర్గం!
ఒక ఉదయాన... కిటికీ నుంచి తొంగి చూస్తున్నప్పుడు... చెట్టు కొమ్మ మీద పిట్ట పాట వినక ఎన్ని రోజులవుతుందో! ఒక సాయంత్రాన... ఆకాశ దేశాన బారులు బారులుగా ప్రయాణించే పక్షుల గుంపును చూసి ఎన్ని రోజులవుతుందో! మాయమైపోతుంది. మనిషిలోని మనిషి మాత్రమే కాదు... పక్షుల జాడ కూడా! అందుకే ఆ పక్షులను తన గుండెల్లో పెట్టుకోవాలనుకుంది కొక్కరేబేలూర్. కర్ణాటక రాష్ట్రంలోని మద్దూరు తాలూకాలో ఉన్న ఈ చిన్న ఊళ్లోకి అడుగుపెడితే...
చెట్లకు వేలాడే పక్షిగూళ్లు స్వాగతతోరణాల్లాగ కనిపిస్తాయి. పక్షులను ప్రేమించమని మౌనంగా చెబుతాయి. ప్రతి చెట్టుకూ పక్షి గూళ్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఇక మే నెలలోనైతే చిట్టి చిట్టి పక్షి పిల్లలతో వాతావరణం అల్లరి అల్లరిగా ఉంటుంది.
పక్షులను పక్షుల్లా కాకుండా తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. పక్షులు కూడా గ్రామస్థులకు బాగా అలవాటుపడిపోయాయి. వాటికి ఎంత దగ్గరికి వెళ్లినా, భయంతో పారిపోకుండా కళ్లలో కళ్లు పెట్టి ప్రేమగా చూస్తాయి. ఆ గ్రామానికి వచ్చే ప్రధాన పక్షుల్లో పెలికాన్, బ్లాక్ ఐబిస్, గ్రే హెరాన్, ఇండియన్ పాండ్ హెరాన్ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. సెప్టెంబర్‌లో గ్రామంలోకి ప్రవేశించే పక్షులు మే తరువాత వేరే చోటుకి వలస వెళతాయి.
ఎక్కడెక్కడి నుంచో తమ గ్రామానికి వలస వచ్చే ఈ పక్షులను కేవలం అతిథులుగా మాత్రమే కాకుండా తమ అదృష్టంగా కూడా భావిస్తారు ఆ గ్రామస్థులు. చెట్ల మీద నివాసముండే పక్షులు అప్పుడప్పుడూ దగ్గరలోని పంటపొలాలపై వాలి తమ ఆకలిని తీర్చుకుంటాయి. దీనివల్ల నష్టం వాటిల్లినా... వాటిని తరిమికొట్టడం, హింసాత్మక చర్యలకు దిగడంలాంటివేమీ చేయరు గ్రామస్థులు. పక్షులపై వారి ప్రేమను ప్రభుత్వం సైతం అర్థం చేసుకుంది. అందుకే పక్షుల కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తుంది.
‘‘ఈ పక్షులను చూస్తుంటే సొంత బిడ్డల్ని చూసినట్లుగా అనిపిస్తుంది’’ అంటుంది గ్రామానికి చెందిన ఒక గృహిణి. కొందరైతే చనిపోయిన తమ ఆత్మీయులను ఈ పక్షుల్లో చూసుకుంటా మని చెబుతున్నారు.
‘‘మీది ఏ ఊరు? అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే, మా ఊరు పేరు చెబితే రాష్ట్రంలో గుర్తు పట్టనివారు ఉండరు. పైగా మా ఊరి ఔన్నత్యం గురించి పొగుడుతుంటారు కూడా’’ అంటాడు గ్రామానికి చెందిన కుమార్ అనే విద్యార్థి.
‘‘ఆడపిల్ల ప్రసవానికి పుట్టింటికి వెళ్లినట్లు ఈ పక్షులు మా ఊరికి వస్తాయి’’ అని గర్వంగా చెబుతాడు యోగేశ్ అనే యువకుడు. కొక్కరేబేలూర్ చేస్తున్న పుణ్యం ఊరకే పోలేదు. రాష్ట్రంలో ఎన్నో గ్రామాలకు ఈ గ్రామం ‘రోల్ మోడల్’గా మారింది. ప్రభుత్వం కూడా పక్షుల సంక్షేమానికి ప్రత్యేకంగా గ్రాంటు విడుదల చేస్తోంది.
పక్షులను వాటి మానాన వాటిని వదిలేయడం కాకుండా వాటి ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తుంటారు గ్రామస్థులు. ఏదైనా పక్షి అనారోగ్యంతో కనిపించినా, గాయపడినా తక్షణ వైద్య సహాయం అందిస్తారు. కొందరైతే చేపపిల్లలను ప్రేమగా పక్షుల నోటికి అందిస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ ఊరు దాటిన తరువాత ఒక్క చెట్టు మీద కూడా పక్షుల గూళ్లు కనిపించవు. దీన్ని బట్టి పక్షులకు, ఆ ఊరికి ఉన్న అనుబంధం ఏపాటిదో అర్థమవుతుంది.
‘‘పక్షులు ఈ ఊరికి ఎప్పటి నుంచి రావడం మొదలైంది? ఈ ఊరికే ఎందుకు రావడం మొదలైంది?’’లాంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలేవీ దొరకక పోవచ్చు. కాని వాటి గురించి అందరూ చెప్పే సమాధానం ఒక్కటే-
‘‘పక్షులు కొలువైన చోట ఊరికి మంచి జరుగుతుంది’’ అని!