విండోస్‌లో సైబర్‌ అటాక్‌..? స్పష్టతనిచ్చిన సీఈఓ | Microsoft incident is not a cyber attack: CrowdStrike CEO | Sakshi
Sakshi News home page

విండోస్‌లో సైబర్‌ అటాక్‌..? స్పష్టతనిచ్చిన సీఈఓ

Published Sat, Jul 20 2024 1:31 PM | Last Updated on Sat, Jul 20 2024 1:45 PM

Microsoft incident is not a cyber attack: CrowdStrike CEO

మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ‘బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌’ అనే మెసేజ్‌ వచ్చింది. విండోస్‌ సెక్యూరిటీ సర్వీసులు అందించే క్రౌడ్‌స్ట్రైక్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఘటన సైబర్‌ అటాక్‌ కాదని క్రౌడ్‌స్ట్రైక్‌ సీఈఓ జార్జ్ కర్ట్జ్ స్పష్టం చేశారు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్రౌడ్‌స్ట్రైక్ వల్ల ఏర్పడిన సమస్యను అంగీకరించారు. ‘క్రౌడ్‌స్ట్రైక్‌ ప్రపంచ వ్యాప్తంగా సిస్టమ్‌లను ప్రభావితం చేసే అప్‌డేట్‌ విడుదల చేసింది. దానివల్ల నిన్న మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాన్ని గుర్తించాం. కస్టమర్‌లకు అసరమయ్యే సాంకేతిక మద్దతును సమకూర్చేలా, తిరిగి తమ సిస్టమ్‌లను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం’ అని సత్య ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ మెసేజ్‌ రావడంతో ఇదో సైబర్‌ అటాక్‌ అని ప్రాథమికంగా కొందరు భావించారు. విండోస్‌ సెక్యూరిటీ సర్వీసులు అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ దీనిపై స్పష్టతనిచ్చారు. ‘మైక్రోసాఫ్ట్‌ సేవల్లో కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ఘటన భద్రతా ఉల్లంఘన లేదా సైబర్‌అటాక్ కాదు. వినియోగదారులు డేటా భద్రంగా ఉంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. దాన్ని పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని సిస్టమ్‌లను బ్యాకప్ చేశాం. విండోస్‌లోని ఫాల్కన్ కంటెంట్ అప్‌డేట్‌ వల్ల సమస్య ఏర్పడింది. ప్రామాణిక సమాచారం కోసం దయచేసి కంపెనీ వెబ్‌సైట్‌ను అనుకరించండి’ అని వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఎర్రర్‌ మెసేజ్‌..

ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, బ్యాంకులు, అత్యవసర సేవలతో సహా వివిధ రంగాల్లోని టెక్‌ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాంతో క్రౌడ్‌స్ట్రైక్‌ సంస్థకు ఏకంగా రూ.1.34 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement