శిశుమరణాలపై తూతూ మంత్రంగా విచారణ
సాక్షి కథనాలకు స్పందన
ఉర్లాకులపాడు (రాజవొమ్మంగి) : రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు, జడ్డంగి గ్రామంల్లో సంభవిస్తున్న శిశుమరణాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం విచారణ చేపట్టారు. శిశుమరణాలపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వార్తలకు అధికారులు స్పందించారు. అయితే పత్రికలలో వచ్చిన వార్తలకు తప్ప స్పందించని అధికారులు ఈసారి కూడా తూతూమంత్రంగా తమ విచారణ పూర్తయిందనిపించారు. జడ్డంగి పీహెచ్‌సీ, శిశుమరణాలు సంభవించిన ఇళ్లకు వెళ్లి మరణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇటీవల ఉర్లాకులపాడు, జడ్డంగి గ్రామంల్లో వరుసగా మరణించిన శిశుమరణాల బాధిత కుటుంబాల వారిని అధికారులు పరామర్శించి తల్లీపిల్లలకు జడ్డంగి పీహెచ్‌సీ ద్వారా అందిన, అందని వైద్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. వారి నుంచి లిఖితపూర్వక వాంగ్మూలం సేకరించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్‌సెంటర్ల పనితీరు పరిశీలించారు.
శిశుమరణాలు సంభవించిన గిరిజన కుటుంబాల ఆహారనియమాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ అంశాలను క్రోడీకరించి నివేదికను జిల్లాకలెక్టర్‌కు నివేదిస్తామని విచారణలో పాల్గొన్న ఏడీఎంఅండ్‌హెచ్‌ఓ పవన్‌కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి అనిత విలేకరులకు తెలిపారు.