చెరువులో పడి చిన్నారి దుర్మరణం
Published Mon, Jan 30 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
ఏనుగువానిలంక (యలమంచిలి) : ఏనుగువానిలంక పాత దళితపేటలోని చెరువు మరో చిన్నారి ప్రాణాలను బలిగొంది. గ్రామానికి చెందిన పాలపర్తి రమేష్, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు విక్కీ, లక్కీ ఉన్నారు. చిన్న కుమారుడు లక్కీ (2) ఆదివారం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. రమేష్, మౌనిక దంపతులు ఇద్దరూ ఉదయం చర్చికి వెళ్లి ఇంటికి వచ్చారు. రమేష్‌కు గ్రామంలో మెడికల్ షాపు ఉంది. మధ్యాహ్నం అతను షాపునకు వెళ్లగా మౌనిక ఇంటిలో పని చేసుకుంటుంది. ఈ సమయంలో లక్కీ చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపోయాడు. వెంటనే కొడుకు కోసం చూసిన మౌనిక పరుగున వెళ్లి బిడ్డను పైకితీయగా అప్పటికే లక్కీ మరణించాడు. సరిగ్గా ఇదే ప్రదేశంలోనే గతేడాది డిసెంబర్ 27న అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటున్న మూడేళ్ల బాలుడు మనోజ్ చెరువులో పడి మరణించాడు. నెలకే మరో బిడ్డ చెరువులో పడి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రేవు మూసివేయాలి
పాత దళితపేటలోని ఈ చెరువు రేవు వాడుకలో లేదు. ఇది ఏటవాలుగా ఉండి చివర కూడా పాకుడు పట్టి ఉండడంతో రేవులో దిగిన వారు జారిపోతున్నారు. లక్కీ కూడా పాకుడుకు జారి పడిపోయాడని స్థానికులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రేవు మూసివేసి చెరువుగట్లను ఎత్తు చేసి మరిన్ని ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement