
ప్రతీకాత్మక చిత్రం
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): ముక్కుపచ్చలారని ఐదునెలల బాలుడి ప్రాణాలు ప్రమాదవశాత్తూ గాల్లో కలిసిపోయిన విషాద సంఘటన కడప నగర శివార్లలో బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో రామచంద్రాపురంలో నివాసం వుంటున్న పుల్లయ్య ఫాతిమా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నాడు. పుల్లయ్య, భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఐదునెలల క్రితం ఒక బాబు పుట్టాడు. బుధవారం తెల్లవారుజామున భారతి తన కుమారుడిని చేతపట్టుకుని, మొదటి అంతస్థు నుంచి రెండో అంతస్థు తీసుకెళుతున్న సమయంలో ఆమె చీర స్టెప్స్‌కు తగులుకోవడంతో పిల్లాడు ఆమె చేతిలో నుంచి జారి స్టెప్స్ మీదుగా కిందపడిపోయాడు.
చదవండి: మరో మూడు రోజులు జాగ్రత్త.. వాతావరణ శాఖ అలర్ట్..
దీంతో షాక్‌కు గురైన భారతి తేరుకునేలోపే మృత్యువాత పడ్డాడు. స్థానికంగా వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్లేసరికే మరణించాడని నిర్ధారించారు. ఆ సమయంలోనే తనను ఎవరో లాగినట్లుగా బాలుడి తల్లి భారతి భావించింది. ఈ క్రమంలోనే చైన్‌స్నాచింగ్ చేసేందుకు ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వచ్చినట్టు కలకలం రేగింది. ఈ సంఘటనపై కడప తాలూకా సీఐ కె. ఉలసయ్య ఆదేశాల మేరకు ఎస్‌ఐ ఎస్‌కెఎం హుసేన్ తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. వాస్తవానికి తల్లి భారతి, తమ ఐదు నెలల పిల్లాడిని పై అంతస్థులోకి తీసుకుని వెళ్లే క్రమంలో చీర, స్టెప్స్‌కు తగిలి జారిపడినట్లుగా, అదే సమయంలో తల్లి భారతి షాక్‌కు గురైందని, ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా సీఐ కె. ఉలసయ్య తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment