మాటలు కలిపి..మత్తు మందు ఇచ్చి ...
మాటలు కలిపి..మత్తు మందు ఇచ్చి ...
Published Mon, Jul 24 2017 11:41 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
వృద్ధులే టార్గెట్
పట్టుబడ్డ నిందితుడు
రూ.ఆరు లక్షల సొత్తు స్వాధీనం
అమలాపురం టౌన్ : బంగారు నగలు కాజేసేందుకు అతడి టార్గెట్ ఎప్పుడూ వృద్ధురాళ్లపైనే ఉంటుంది. బస్ స్టేషన్లలో, ఆటో స్టాండ్‌ల్లో 70 ఏళ్లు వయసు దాటి ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధులు ధరించే బంగారు నగలపై అతడి కన్ను పడుతుంది. ముందు మాటలు కలపి...తర్వాత బంధుత్వాలు చెప్పి...ఆపై మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌లు ఇచ్చి మత్తులోకి వెళ్లాక వారి ఒంటిపై బంగారు నగలు కాజేసి అదృశ్యమయ్యే కిలాడీ అతడు. అమలాపురం డివిజన్‌లో ఈ తరహాలో గత ఆరేళ్ల నుంచి అనేక నేరాలు చేస్తూ ఎందరో వృద్ధరాళ్ల నుంచి బంగారు నగలు కాజేసిన అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన కంఠంశెట్టి శ్రీనును అమలాపురం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అతను చేసిన నేరాల చిట్టాను చెప్పించటమే కాకుండా రూ.ఆరు లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ అరెస్ట్ చేసిన నిందితుడు శ్రీనును ప్రవేశపెట్టి అతను నుంచి స్వాధీనం చేసుకున్న 203.5 గ్రాములు బంగారు నగలు, 67 గ్రాముల వెండి వస్తువులు, 83 మత్తు బిళ్లలను చూపించారు. నిందితుడు జిల్లాలోని అంబాజీపేట, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, ముమ్మిడివరం, కొత్తపేట, అమలాపురం ఇలా అనేక ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్టు తెలిపారు. సోమవారం ఉదయం అమలాపురంలోని నల్లా సూర్యచంద్రరావు ఘాట్ వద్ద శ్రీను బంగారు నగలు, మత్తు బిళ్లలతో అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని అరెస్ట్ చేసి విచారించగా నేరాలు అంగీకరించాడని తెలిపారు.
రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు
ఆరేళ్ల నుంచి నేరాలు చేస్తున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసి అతడి నుంచి బంగారు నగలు రికవరీ చేసిన పట్టణ సీఐ శ్రీనివాస్, ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు, హోంగార్డు సుందర అనిల్‌ను డీఎస్పీ ప్రసన్నకుమార్ అభినందించారు. వీరికి రివార్డులు ప్రకటించేందకు జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
Advertisement