
దొరవారి తిమ్మాపురానికి కాలి నడకన వెళ్తున్న అధికారులు
గూడూరు: మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన గూడూరు మండలంలోని అటవీ గ్రామం దొరవారి తిమ్మాపురానికి సరైన దారిలేదు. 20 కుటుంబాల్లోని 80 మంది గిరిజను లు పోడు వ్యవసాయం చేస్తుంటారు. రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం బుధవారం కొత్తగూడ పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆమె స్పందించి ఊరి సమస్యలపై నివేదిక అందజేయాలని కలెక్టర్ గౌతమ్‌ను ఆదేశించారు.
ఆయన అక్కడికక్కడే తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఇతర అధికారులతో సమావేశమై గ్రామ సమస్యల గురించి ప్రశ్నించగా.. తామంతా కొత్తగా వచ్చినందున అవగాహన లేదని చెప్పారు. దీంతో గురువారం అందరూ గ్రామానికి వెళ్లాలని ఆదేశించా రు. ఈ మేరకు ఉదయమే తహసీల్దార్ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ ప్రసాదరావు ఊట్ల మీదుగా 6 కి.మీ. వాహనాలపై వెళ్లారు. అక్కడి నుంచి సుమారు కాలినడకన 8 కి.మీ. వెళ్తూ మార్గమధ్యలో వాగు దాటి ముందుకుసాగారు. దొరవారి తిమ్మాపురానికి చేరుకుని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.