-
ఏజన్సీలో అడవిబిడ్డల ఆనందహేల
-
విల్లంబులతో పురుషులు వేటకు పయనం
-
ఆటపాటలతో మహిళల నృత్యాలు
చింతూరు (రంపచోడవరం):
ఆదివాసీలకు ఎంతో ప్రాముఖ్యం కలిగిన భూమిపండుగ వేడుక ఏజెన్సీ వ్యాప్తంగా కోలాహలంగా సాగుతోంది. తొలకరి ప్రారంభంలో మూడు రోజులపాటు ప్రతి పల్లెలో ఈ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి తమ భూముల్లో సిరులు పండాలని కోరుకుంటూ కులదేవతలతో పాటు విత్తనాలకు, భూమికి పూజ నిర్వహించడమే ఈ పండుగ ప్రాముఖ్యత. మూడు రోజులపాటు నిర్వహించే పండుగ వాతావరణం ముగియగానే అందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు.
సంప్రదాయ వేట, ఆటాపాటా
మూడు రోజులపాటు పురుషులంతా కలసి విల్లంబులు చేతబూని సంప్రదాయ వేట నిమిత్తం అడవిబాట పడతారు. ఇదే సమయంలో మహిళలు పండుగ నిర్వహణ కోసం గ్రామ సమీపంలోని రహదారుల వద్దకు చేరుకుని రేల నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ, వచ్చీ, పోయే వాహనాలను ఆపుతూ డబ్బులు అడుగుతారు. కొన్ని గ్రామాల మహిళలు మండల కేంద్రాలకు వచ్చి దుకాణాల వద్ద కూడా డబ్బులు అడుగుతారు. ఇలా మూడు రోజులపాటు వసూలైన డబ్బులతో పూజలకు కావల్సిన సామగ్రి కొనుగోలు చేసి పండుగ నిర్వహిస్తారు. ఇక ఉదయం వేటకు వెళ్లిన పరుషులు సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటారు. వేటలో భాగంగా ఏదైనా జంతువును వేటాడితే దానిని గ్రామస్తులంతా సమానంగా పంచుకుంటారు. ఏ జంతువును వేటాడకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన పురుషులపై సంప్రదాయంలో భాగంగా మహిళలు పేడనీళ్లు జల్లి స్వాగతం పలుకుతారు.