తెలంగాణ రాబిన్హుడ్.. పండుగ సాయన్న
మహబూబ్నగర్: పేదల పాలిట ఆపద్భాందవుడిగా, ఆకలికి అలమటించే నిరుపేదల ఆకాలి తీర్చే సాయన్న ఇక్కడి ప్రాంత ప్రజల ఇష్టమైన నాయకుడు. తెలంగాణ ప్రాంతంలో కనుమరుగైన వీరుడి చరిత్ర ఉందంటే అది పండుగ సాయన్నదే.
ఈయన కేవలం ధనవంతులపై, భూస్వాములపై దాడులు చేసే వ్యక్తిగానే సమాజానికి పపరిచయం చేసిన పెత్తందార్లు, ఆయన నిజాం పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను, చరిత్రను కనుమరుగు చేశారు. అసలు సాయన్న తిరుగుబాటుకు కారణాలు, పరిస్థితులు మాత్రం ఎవరూ వివరించలేదు. మొహర్రం రోజు నాడే పండుగ సాయన్న జయంతిని చేయడం ఆనవాయితీగా వస్తుంది.
మెరుగోనిపల్లి జన్మస్థలం
మండలంలోని కేశవరావుపల్లి పరిధిలో ఉన్న కిలాట్నగర్ (మెరుగోనిపల్లి) గ్రామం ఈయన జన్మ స్థలం. తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. దాదాపుగా 1858 నుంచి 1860 మధ్యలో జన్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆయనపై భూస్వాములు పెట్టిన కేసులు, జైలు శిక్ష పడిన విషయాలను బట్టి ఆయన జన్మించిన సంవత్సరాలు అంచనా వేశారు.
1860లో రజాకార్ల రాజ్యం కొనసాగుతుండేది. అప్పట్లో రజాకార్లు, భూస్వాములను చెప్పుచేతుల్లో పెట్టుకుని పాలనచేస్తుండే వారు. ఈ తరుణంలో భూస్వాములు పండుగ సాయన్న కుటుంబం భూమిని ఆక్రమించుకున్నారు. ఈ విషయంలో తిరగబడ్డ కుటుంబాన్ని వేధించారు. మొదటి సారి సాయన్న భూస్వాములను పొలంలో నాగళ్లు కట్టిన సమయంలో వారిని ఎదురించాడు.
సాయన్నను ఏమైనా చేస్తారని కుటుంబ సభ్యులు అతన్ని చౌడూర్ సమీపంలోని మేక గుండు చెంత దాచి పెట్టారు. భూస్వాములు దాడులు చేసి కుటుంబాన్ని మరింత భయానికి గురిచేయాలని సాయన్న చిన్నమ్మపై లైంగిక దాడి చేశారు. అజ్ఞానంతంలో ఉన్న సాయన్న భూస్వాములపై దాడికి పథకాలు చేస్తూ తరుచు దాడులు చేయటం మొదలు పెట్టాడు. దీంతో కొందరు అనుచరులను సైతం సమీకరించుకుని దాడులకు దిగేవాడు. పలుమార్లు నిజాం పోలీసుల బలగాలతో సాయన్న కోసం వేట సాగించారు. సాయన్న నిజాం పోలీసులను అడవులు వెంట తిప్పి వారిని తరిమివేసేవాడు.
పండుగ సాయన్నపేరు ఎలా వచ్చిందంటే..
సాయన్న నిజాంలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తరుణంలో చాలా గ్రామాలు ఆకలితో ఆలమటించేవి. ఇవి చూసి చలించిన సాయన్న గ్రామాలకు తిండి పెట్టాలని ఆలోచించి ఊర్లకు ఊర్లను ఒక చోట చేర్చి వారికి కావాల్సిన ఆహారధాన్యాలు దోపిడి చేసి తీసుకుని వచ్చి వారికి ఇచ్చేవాడు. అలాగే మండల సమీపంలోని మైసమ్మ అడవి ప్రాంతంలో సాయన్న పండుగ చేసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు భోజనం పెట్టి ఆకలి తీర్చేవాడు.
అప్పట్లో ఆకలి తీరాలంటే సాయన్న ఎక్కడో ఒక చోట దారిదోపిడి చేసి వంటలు వండించి పండుగలు, కందుర్లు చేసేవాడు. అప్పల్లో ప్రజలకు ఇష్టమైన దసర, పీర్లపండగ కలిసి వచ్చిన ఏడాది జన్మించటంతో అతన్ని పండుగ సాయన్నగా ప్రజలు పిలుచుకోవటం మొదలు పెట్టారు. అప్పటి వరకు సాయన్న తెలుగు సాయన్నగా సుపరిచితుడు.