మదన్‌లాల్ ప్రచార ర«థాన్ని అడ్డుకున్న తండా వాసులు
ఏన్కూరు: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీఆర్‌ఎస్ వైరా అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్‌కు ఒకచోట పరాభవం ఎదురైంది. ఆయన ప్రచార రథాన్ని ఓ పల్లె వాసులు అడ్డుకున్నారు. ‘‘మా రోడ్డు అధ్వానంగా ఉంది. రోడ్డు లేని మా ఊరి అబ్బాయికి అమ్మాయిని కూడా ఇవ్వడం లేదు. మా ఊరి అమ్మాయిని ఎవరూ చేసుకోవడం లేదు. ఆటో రావలంటే ఏన్కూరు నుంచి ఐదొందలు అడుగుతున్నారు. పండగలకు, శుభకార్యాలకు బయటి నుంచి మా బంధువులు కూడా రావడం లేదు.
వీటన్నింటికీ కారణం.. రోడ్డు లేకపోవడమే. గత ఎన్నికల్లో ఇప్పటిలాగా మా ఊరికొచ్చి.. రోడ్డు వేయిస్తానన్నారు. మళ్లీ ఇప్పుడొచ్చారు. రోడ్డు వేయిస్తామని చెప్పి వేయించకుండా.. మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగటానికి మా ఊరొచ్చారు..?’’ అంటూ, టీఆర్‌ఎస్ వైరా అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్‌పై మండలంలోని పైనంపల్లి తండా వాసులు విరుచుకుపడ్డారు. ఆయన ప్రచార రథాన్ని అడ్టుకున్నారు. దీంతో, మదన్‌లాల్ అనుచరులకు.. తండా వాసులకు మధ్య తోపులాట జరిగింది. ఇది, బుధవారం రాత్రి జరిగింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జన్నారం, ఏన్కూరు, గార్లఒడ్డు, తూతకలింగన్నపేట, పికెబంజర, పైనంపల్లి తండాలో మదన్‌లాల్ ప్రచారం నిర్వహించారు. పైనంపల్లితండాలో ప్రచారం ముగిసిన తరువాత తిరిగి వెళుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. వారిని మదన్‌లాల్ అనుచరులు పక్కకు లాగేశారు. ఈ దశలో తోపులాట జరిగింది. కొద్దిసేపటి తరువాత మదన్‌లాల్ వెళ్లిపోయారు.
శంకుస్థాపన చేద్దామనుకునేసరికే ప్రభుత్వం రద్దయింది...
‘‘తిమ్మారావుపేట రోడ్డు నుంచి పికెబంజర, పైనంపల్లితండా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. శంకుస్థాపన చేద్దామని అనుకుంటుండగగానే.. ఏడు నెలల ముందే ప్రభుత్వం రద్దయింది. ఎలక్షన్ కోడ్ కారణంగా శంకుస్థాపన చేయలేకపోయాను’’ అని, మదన్‌లాల్ చెప్పారు. పికెబంజరలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment