ఏజెన్సీ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి చర్యలు
Published Thu, Feb 9 2017 1:13 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
బుట్టాయగూడెం (పోలవరం) : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో కె.కోటీశ్వరి చెప్పారు. బుధవారం బుట్టాయగూడెం మండలంలోని కేఆర్ పురం ఐటీడీఏలో జిల్లా మలేరియా కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. శుక్రవారం నులిపురుగుల నివారణకు పంపిణీ చేసే మాత్రల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెంలో ప్రభుత్వ ఆస్పత్రి మంజూరైం దని, సిబ్బందిని నియమించాల్సి ఉందన్నారు. అదేవిధంగా వేలేరుపాడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్ ఆదేశాలు జారీ చేశారని ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫార్మసిస్ట్, ఎల్‌టీ పోస్టుల భర్తీకి కూడా కృషి చేస్తున్నామన్నారు. గిరిజన గ్రామాల్లో మలేరియా వ్యాప్తి చెందకుండా మలాథియాన్ స్ప్రేయింగ్ చేయిస్తున్నామని చెప్పారు. అన్ని పీహెచ్‌సీల్లో టైఫాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు జరిపే విధంగా ఏర్పాటు చేశామన్నారు. మాతాశిశు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో కొత్తగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 17 కేంద్రాలను సిద్ధం చేశామని, మరో 14 కేంద్రాలు సిద్ధం చేస్తున్నామన్నారు. డీ వార్మింగ్ డేను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా 6 లక్షల 400 మంది పిల్లలకు మాత్రలు అందిస్తామని చెప్పారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో వంశీలాల్ రాథోడ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement