సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కల. దీన్ని సాధిస్తే తమ జీవితానికి, భవిష్యత్తుకు ఇక ఢోకా ఉండదనుకుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అహోరాత్రులు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఒకేసారి 1.34 లక్షల సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది.
లంచాలకు, సిఫారసులకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా నియామకాలు చేసి అభ్యర్థుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రశ్నాపత్రం రూపకల్పన బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా వివిధ విభాగాల్లో 6,296 పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు మొత్తం 78 నోటిఫికేషన్లను ఇచ్చింది.
అంతేకాకుండా ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా 1,446 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో ఉద్యోగార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కొలువును దక్కించుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు.
నిరుద్యోగుల మేలుకు ఎన్నో చర్యలు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల ముంగిటకే తీసుకెళ్లి.. వారి సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే పరిష్కరించేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సచివాలయాల్లో పనిచేయడానికి ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం.
అంతేకాకుండా ఒక్క వైద్యశాఖలోనే దాదాపు 55 వేల పోస్టులను భర్తీ చేశారు. ఇందులో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఎన్నికల ముందు ప్రయోజనం పొందాలనే దురుద్దేశంతో 2018 డిసెంబర్‌లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి వదిలేశారు. వాటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఈ పరీక్షలను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే నిర్వహించి, పోస్టులను భర్తీ చేసింది.
ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ..
నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేయడానికి వీలుగా ఏపీపీఎస్సీతో సమన్వయం చేసుకుంటోంది. నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఎలాంటి వివాదాలకు తావులేకుండా కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత నాలుగేళ్లల్లో మొత్తం 78 నోటిఫికేషన్లను ఒక్క కోర్టు వివాదం లేకుండా, ఒక్క నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 పోస్టులను భర్తీ చేయడం విశేషం. ఇంత పక్కాగా ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరిగింది లేదు.
నాడు అలా.. నేడు ఇలా..
గత టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ అంతా అగమ్యగోచరంగా ఉండేది. అంతేకాకుండా ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు తలెత్తేవి. ఇలా పలు కారణాలతో నియామక పరీక్షలు నిలిచిపోవడమో లేక రద్దు కావడమో జరిగేది. అలాంటిది గత నాలుగేళ్లల్లో ఏపీపీఎస్సీ 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 ఉద్యోగాలను ఎలాంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా భర్తీ చేసింది.
అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి న్యాయ వివాదాల్లో చిక్కుకున్నవాటిని సైతం పరిష్కరించింది. ఆ పోస్టులను భర్తీ చేసి అభ్యర్థులకు న్యాయం చేసింది. ఇలా గ్రూప్–1, గ్రూప్–2 వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామకాలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment