వైద్య ఖాళీలు భర్తీ చేయండి.. షరతులు వర్తిస్తాయి
వైద్య ఖాళీలు భర్తీ చేయండి.. షరతులు వర్తిస్తాయి
Published Fri, Jun 30 2017 1:54 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
– ఏజెన్సీలో వైద్యులు, సిబ్బంది భర్తీపై సర్కారు నాటకం
– కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలంటూ సీఎం ఆదేశం
– ఉద్యోగ భద్రత లేకుండా ఏజెన్సీలో పని చేసేందుకు వైద్యుల విముఖత
– రెగ్యులర్ విధానంలో ఎందుకు భర్తీ చేయరు?
– గత ఏడాది చింతూరు సభలో సీఎం ఇచ్చిన హామీ ఏమైంది?
– చాపరాయి ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలని అధికారులకు హితవు
– కాళ్లవాపు మృతుల ఘటనతో నేర్చుకోలేదా..?
– ప్రాణాలు పోతున్నా ప్రకటనలతో సరిపెడతారా..?
సాక్షి, రాజమహేంద్రవరం: వైద్య, ఆరోగ్యశాఖలో తక్షణమే ఖాళీలను భర్తీ చేయండి. కాంట్రాక్టు పద్ధతిలో చేయండి. శాశ్వత నియామకాల వరకు వేసి చూడొడ్డు. చాపరాయి ఘటనతో అధికారులు పాఠాలు నేర్చుకోండి. వైద్య ఆరోగ్యశాఖలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను నీరుగారిస్తే సహించం. ఇదీ క్లుప్తంగా మంగళవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలు. చేసిన సూచనలు.
ఘటన జరిగినప్పుడు హడావుడి చేయండం, అధికారులపై చిందులు తొక్కడం... ఆ తర్వాత షరా మామూలే. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూసిన వారు ఆయన గిరిజనుల ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ చూపుతున్నారోనని ప్రజలు అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది ఏప్రిల్‌లో విలీన మండలాల్లో పర్యటన సందర్భంగా చింతూరు బహిరంగ సభలో మన్యంపై వరాల జల్లు కురిపించారు. ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేసి అవసరమైన అన్ని సదుపాయాలు, వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామన్నారు. పీహెచ్‌సీల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తామని చెప్పారు. జూన్, జూలై నెలల్లో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధితో 16 మంది గిరిజనులు మృతి చెందినప్పుడు ఇలాంటి ప్రకటనలే చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు. చింతూరులో డయాలసిస్, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ చంద్రబాబు మాటలు కోటలు దాటినా పనులు గడప దాటలేదు అన్న విషయం ఏడాది క్రితం ఆయన చేసిన హామీలు, ప్రకటనలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. చింతూరు సభ జరిగి ఏడాది రెండు నెలలు, కాళ్ల వాపు ఘటన జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. ఆ రెండు సమయాల్లో సీఎం చంద్రబాబు వైద్య పోస్టులను తక్షణమే భర్తీ చేస్తామన్నారు. ఆ మేరకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ రెగ్యులర్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు అవసరమైన జీవో ఇవ్వకుండా నాన్చుతున్నారు.
ఉద్యోగ భద్రత లేకుండా ఎవరు వస్తారు..?
కాంట్రాక్టు పద్దతిలో వైద్య పోస్టులను భర్తీ చేయాలని సీఎం చెబుతున్నారు. పట్టణాల్లో అన్ని సౌకర్యాలున్నా కూడా కాంట్రాక్టు విధానంలో పని చేసేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు, కనీసం ఎంబీబీఎస్ చదవిన డాక్టర్లు కూడా రారు. అలాంటిది ఎలాంటి సౌకర్యాలు లేని ఏజెన్సీలో పని చేయడానికి ఎలా వస్తారు?. వైద్య విధానంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ఏజెన్సీలోని ఆస్పత్రుల్లో పోస్టులను రెగ్యులర్ విధానంలో ఎందుకు భర్తీ చేయడంలేదు. వైద్యులు ఇక్కడ ఉండడానికి నివాసం, మంచి ఆహారం చింతూరు, రంపచోడవరంలలో కూడా లభించదు. ప్రస్తుతం నాలుగు రోజుల నుంచి చాపరాయి బాధితులను పరామర్శించడానికి వెళుతున్న అధికారులకు తినడానికి తిండి కూడా దొరకడంలేదు. కొంత మంది అధికారులు అక్కడికి వెళ్లే సమయంలో రాజమహేంద్రవరం నుంచి భోజనం పార్శిళ్లు తీసుకెళుతున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడాలంటే చింతూరు, రంపచోడవరంలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో క్యాంటిన్లు నిర్వహించాలి. వైద్యాధికారులు, సిబ్బంది ఉండేందుకు నివాసాలు నిర్మించాలి. కానీ ఇవ్వన్నీ చేయరు. ఘటన జరిగినప్పుడు మాత్రం ఏదో చేసినట్లు ప్రకటనలతో కాలాన్ని నడిపిస్తారు. కాలంతోపాటు సమస్య కూడా సమసిపోతుంది.
కాళ్లవాపుతో పాఠాలు నేర్చుకోలేదా...?
చాపరాయి ఘటనతో అధికారులు పాఠాలు నేర్చుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి గత ఏడాది జరిగిన కాళ్లవాపు మరణాలతో ఏం నేర్చుకున్నారో ఆ ఘటనపై అనేక మార్లు ప్రకటనలు చేసిన ఆయనకే తెలియాలి. ఏజెన్సీలో పోస్టుల భర్తీకి, కొత్తగా గత ఏడాది చింతూరు సభలో సీఎం ఇచ్చిన హామీల పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపినా అవి చెత్త బుట్టలకే పరిమితమయ్యాయి. ఏడాది అవుతున్నా భర్తీకి సంబంధించిన జీవో ఎందుకు విడుదల చేయలేదో ముఖ్యమంత్రి చంద్రబాబుకే తెలియాలి. 11 మండలాలు, 1180 గ్రామాలు, 4.5 లక్షల మంది ప్రజల ఆరోగ్యంపై సర్కారు నిర్లక్ష్యాన్ని చాపరాయి ఘటన మరోమారు ఎత్తి చూపుతోంది.
Advertisement
Advertisement