ఆస్పత్రిలో అందుబాటులో లేని వైద్యుడు
ప్రసవం చేసేందుకు సిబ్బంది ప్రయత్నం
శిశువును సగభాగం బయటికి తీసి చేతులెత్తేసిన వైనం
శిశువు మృతి, తల్లి క్షేమం.. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
ఉట్నూర్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ వైద్యుల పనితీరుకు ఈ ఉదంతమే పరాకాష్ట. స్థానికంగా ఉండకుండా దూరప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వెళ్లి వస్తూ రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. గురువారం రాత్రి ఓ వైద్యుడు అందుబాటులో లేకపోవడం.. ఓ గర్భిణీకి నైట్ డ్యూటీ సిబ్బంది వైద్యమించి సగం వరకు పాపను బయటకు తీసి ఇక తమవల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో నిండుచూలాలు నరకయాతన అనుభవించడమే కాకుండా.. పండంటి బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. వివరాలు... కెరమెరి మండలం దేవాపూర్ పంచాయతీ బోరిలాల్‌గూడకు చెందిన చౌవాన్ అంగురీబాయి గర్భిణీ. గురువారం సాయంత్రం ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం.. వాగు అడ్డంగా ఉండడంతో 108 వాహనం రాలే ని పరిస్థితి. దీంతో బాధితురాలి అత్తామామ సారుబాయి, లక్ష్మణ్‌తోపాటు ఆమె తల్లి అనిత, మరో ఇద్దరు మామలు రోహిత్‌దాస్, మారుతి కలిసి ఎడ్లబండి సాయంతో రాత్రి 7 గంటలకు కెరమెరి పీహెచ్‌సీకి చేరుకున్నారు. వెద్యుడు అందుబాటులో లేడు. స్టాఫ్‌నర్సు, ఏఎన్‌ఎంలు మాత్రమే ఉన్నారు. దీంతో వారే వైద్యమందించేందుకు ప్రయత్నించారు.
గంటన్నరపాటు ప్రయత్నించి మగ శిశువును సగభాగం వరకు బయటకు తీయగలిగారు. తదుపరి పరిస్థితి బాగోలేదని జైనూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ సూచించారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో 108 సాయంతో సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది అంగురీబాయి పరి స్థితిని గమనించి వెంటనే ఉట్నూర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉట్నూర్ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అప్పటికే సగభాగం బయటికి వచ్చిన శిశువు మృతిచెందడాన్ని గుర్తించిన వైద్యాధికారి వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకుంటే తల్లి ప్రాణాలకు ప్రమాదమని తెలిపారు. ఇక్కడ ఆపరేషన్ సదుపాయం లేదని, వెంటనే రిమ్స్‌కు తీసుకెళ్లాలని అన్నారు. దీంతో ఉట్నూర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిమ్స్‌కు తరలించారు.
అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి మగ మృత శిశువును బయటికి తీశారు. అంగురీబాయి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలోనే 16 రోజులు ఉండాలని వైద్యులు సూచించారు. కాగా.. పెళ్లయిన రెండేళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని సంబరపడ్డ ఆ తల్లి బిడ్డను కోల్పోయి దుఃఖించిన తీరు అందరినీ కలిచివేసింది. ఆస్ప్రతిలోని ఇద్దరు వైద్యులు శ్రీనివాస్, నాగేంద్ర ఆసిఫాబాద్ నుంచే వెళ్లివస్తున్నారు.
నిండు చూలాలి నరకయాతన..
Published Sat, Oct 18 2014 1:06 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement