Agency tribal womens problems during monsoons - Sakshi
Sakshi News home page

గర్భిణుల అరిగోస

Published Fri, Jul 28 2023 3:33 AM | Last Updated on Fri, Jul 28 2023 8:01 PM

Agency tribal womens problems during monsoons - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురిటినొప్పు లొస్తే ఇప్పటికీ ఎడ్లబండిలోనే... లేదంటే బురదలో పంటచేల మీదుగా... అడవి దారిలో నరకయాతన పడి నడుస్తూ... ఏటా వానాకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల గర్భిణుల కష్టా లివి. వాగులు, వంకలు ఉప్పొంగిన ప్పుడు, కల్వర్టులు, రోడ్డు డ్యాం, లోవల్‌ వంతెనలు దెబ్బతిన్న సమయాల్లో ఆసు పత్రులకు వెళ్లేందుకు నేటికీ నానాకష్టాలు పడాల్సి వస్తోంది.

108, 102 వాహనాలు వెళ్లలేక ఎడ్లబండి, ప్రైవేటు వాహనాలు, మనుషులే మోసుకుని వస్తూ ఆసుపత్రు లకు తరలిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు తల్లి, బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ముంచుకొస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నార్నూరు, గాదిగూడ, ఉట్నూరు, ఇంద్రవెల్లి, జైనూర్, కెరమెరి, తిర్యా ణి, బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, వేమనపల్లి, కాసిపేట, కోట పల్లి మండలాల్లో రాకపోకలకు ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నెల 26న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామపంచాయతీ పాటి గ్రామానికి చెందిన మూడు నెలల గర్భిణి రెడ్డి మల్లక్క జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లేందుకు అరిగోస పడింది. ఎర్రవాగు ఉప్పొంగడంతో 108 వాహనం వచ్చే పరిస్థితి లేక ఎడ్లబండి, ఆటోలో వెళ్లింది. మొదట బెల్లంపల్లి, అటు నుంచి మంచిర్యాల ఆసుపత్రికి  తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భస్రావం జరిగింది.

నెరవేరని హామీలు..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రిస్కు ఉన్న గర్భిణులను వారం ముందే ఆసుపత్రికి తరలించి డెలివరీలు చేయాలి. ఇందుకు ప్రత్యేకంగా ‘బర్త్‌ వెయిటింగ్‌ రూమ్స్‌’ ఏర్పాటు చేశారు. ఇది పకడ్బందీగా అమలు కావడం లేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో 133గ్రామాలు ఉన్నాయి. ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాలోనే 219గ్రామాలు హై రిస్కులో ఉన్నాయి.

ఈ గ్రామాల్లో ఈ నెలలో ప్రసవమయ్యే 46మందిని గుర్తించారు. కేవలం నార్మల్‌ డెలివరీలకే ఈ జిల్లాలో సేవలు అందుతున్నాయి. సిజేరి యన్‌ చేయాలంటే ఆదిలాబాద్‌ రిమ్స్, మంచిర్యాలకు రిఫర్‌ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో వానాకాలంలో ఎయిర్‌ అంబులెన్సులు అందుబాటులో ఉంచుతామని  హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.

 ఇది ఆదిలాబాద్‌ జిల్లా నార్నూరు మండలం ఎంపల్లి, గోండుగూడ వెళ్లే దారి. వర్షాలు కురిసి వరదలు వస్తే నానా కష్టాలు పడాలి. అత్యవసర సమయంలో గర్భిణులు, బాధితులు ఆసుపత్రులకు వెళ్లేందుకు ఇక్కడి గిరిజనులు నరకం చూస్తున్నారు.

గురువారం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నాగారానికి చెందిన నిండు గర్భిణి దుర్గం లావణ్య పురిటి నొప్పుల బాధతోనే అటవీ ప్రాంతం గుండా నడవాల్సి వచ్చింది. ఇక్కడ కల్వర్టు దెబ్బతినడంతో తిప్పలు పడాల్సి వచ్చింది.

ఎందుకీ సమస్య..?
అటవీ సమీప గ్రామాలకు రోడ్లు వేసేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు రావడం లేదు. అనాదిగా ఆ గ్రామాలకు మట్టి రోడ్లే దిక్కవుతున్నాయి. రిజర్వు ఫారె స్టుల్లో కొత్త రోడ్లు, విస్తరణ, కల్వర్టులు, హై లెవల్‌ వంతెనల నిర్మాణాలకు అనుమతుల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండానే  రిజర్వు ఫారెస్టుల్లో రోడ్ల పనులు చేపట్టారు. అయితే వాటిపై కేసులు నమోదయ్యాయి.

కొత్త అనుమతులు పొందాలంటే క్లిష్టంగా మారింది. కొన్ని చోట్ల టైగర్‌జోన్, రిజర్వు ఫారెస్టు గుండా వెళ్లే రోడ్లకు అనుమతులు కేంద్రం నుంచి సులువుగా రావడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు నేరుగా నిధులు మంజూరు చేయించి, పనులు చేపట్టే ప్రయత్నాలు చేస్తే, అటవీ శాఖ అభ్యంతరాలతో నిలిచిపోయిన ఘటనలు ఉన్నాయి. 

ఈ నెల 24న కుమురంభీం జిల్లా దహెగాం మండలం లోహకు చెందిన గర్భిణి మడే ప్రమీలను సరైన రోడ్డు సౌకర్యం లేక అష్ట కష్టాలు పడుతూ ఎడ్లబండిలో ఆసుపత్రికి తరలించారు. ఇదే మండలం రావుపల్లికి చెందిన ఆలం భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు వచ్చాయి.

సిగ్నల్స్‌ లేక సెల్‌ఫోన్లు పనిచేయక 108కు సమాచారం ఇవ్వకలేకపోయారు. 30కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్‌సీ చేరుకునేందుకు ప్రైవేట్‌ జీపులో వెళ్లారు. చివరకు తల్లీబిడ్డ క్షేమం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ నెల 20న ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం అంకాపూర్‌కు పరిధి చిన్నమారుతిగూడకు చెందిన ఆత్రం సావిత్రి బాయి పురిటి నొప్పులతో బాధపడుతూ అరకిలోమీటరు మేర బురదలో, పంట చేను మీదుగా నడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. ఈ ఆవాసానికి సరైన రోడ్డు లేకపోవడమే ఇక్కడి వారికి శాపంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement